టాలీవుడ్ ప్రముఖ రచయితల పేర్లలో కోన వెంకట్ పేరుండేది…కానీ ఇప్పుడు ఎక్కడా ఆ పేరు వినిపించడం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన అందించిన కథలన్నీ అట్టర్ ఫ్లాప్ కావడంతో కెరీర్లో ఎక్కడా జోష్ లేదు. ఇలాంటి టైమ్ లో వస్తోన్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీతో హి ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడా?
ఒకప్పుడు వరుస విజయాలతో రచయితగా స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేసిన కోన వెంకట్ గత కొంత కాలంగా సరైన హిట్ ఇవ్వలేకపోయాడు. అయన పేరు చెప్పగానే ఢీ, రెడీ, దూకుడు, అదుర్స్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. ఇక దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించాడు. వీళ్లిద్దరి కాంబోలో చివరగా వచ్చిన మూవీ బ్రూస్ లీ ఫ్లాప్ అయింది. అదే టైమ్ లో కోనవెంకట్ నిర్మాత, రచయితగా పనిచేసిన గీతాంజలి హిట్టైంది. తనకి అదే చివరి హిట్ మూవీ. ఆ తర్వాత చేసిన ప్రయోగాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు కోన వెంకట్.
హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘గీతాంజలి’కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాని కోన వెంకట్ కథ రాసి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ పై పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి కోన వెంకట్ కేవలం కథ మాత్రమే అందించగా, సామజవరగమన వంటి సూపర్ హిట్ సినిమాకి పని చేసిన భాను, నందు ఈ చిత్రానికి మాటలు రాశారు. మార్చి 22న ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాతో కోన వెంకట్ మరో విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ మూవీకి కథ అందించిన రచయిత కోన వెంకట్ మళ్లీ దూకుడు పెంచాలంటే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా హిట్ అవ్వాల్సిందే. దీంతో పాటూ మరో రెండు మూడు సినిమాలు హిట్టైతే మళ్లీ ఇండస్ట్రీలో కోనవెంకట్ జోరు కొనసాగుతుందేమో.
ఈ సినిమా హిట్ కేవలం కోన వెంకట్ కి మాత్రమే కాదు అంజలికి కూడా చాలా అవసరం. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్నట్టే తెచ్చుకుని ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి కానీ ఆ రేంజ్ హిట్ పడడం లేదు. గీతాంజలి లానే గీతాంజలి మళ్లీ వచ్చింది కూడా హిట్టైతే మళ్లీ ఇండస్ట్రీలో అంజలి బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. మరి గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ…