మధురైకి వెళ్లిన భక్తులు మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వచ్చేస్తుంటారు. కొద్దిమంది మాత్రమే అక్కడికి కాస్త దూరంలో ఉన్న అళగర్ కోవిల్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఎందుకంటే ఈ ఆలయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు… కానీ..ఇది 2 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం ఇది. దీనిని దక్షిణ తిరుపతి అని కూడా పిలుస్తారు
మధురైకి ఓ 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన చెట్ల మధ్య కొండ పక్కనే ఉంటుంది అళగర్ కోవిల్ ఆలయం. ఇందులోని మూలమూర్తి పేరు తిరుమాళ్. అళగర్ అంటే అందమైనవాడు అని అర్థం..ఇక్కడ స్వామివారి విగ్రహం అంత్యంత సుందరంగా ఉంటుంది అందుకే స్వామిని అళగర్ అని పిలుస్తారు. ఆళ్వారులు కూడా ఈ స్వామి సౌందర్యాన్ని పొగుడుతూ వందకు పైనే పాశరాలు రచించారట. వైష్ణవులు దివ్యంగా భావించే 108 పుణ్యక్షేత్రాలలో ఇదొకటి.
మీనాక్షికి సోదరుడు అళగర్
అళగర్ కోవిల్ చరిత్ర గురించి ఎవ్వరూ ఇప్పటివరకూ స్పష్టంగా చెప్పలేదు కానీ మీనాక్షి అమ్మవారికి ఈ స్వామిని సోదరునిగా భావిస్తారు. మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం తరలివెళ్తుంది. ఈ అళగర్ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం. మహాభారతకాలంలో ధర్మరాజు, అర్జునులు సైతం ఈయనని దర్శించారని అంటారు. కృష్ణదేవరాయలు మొదలుకొని విశ్వనాథ నాయకుని వరకు అందరూ ఈ స్వామిని సేవించినవారే. పాండ్యరాజులలో రెండవవాడైన మలయధ్వజ పాండ్యరాజుకి ఈ స్వామి ప్రత్యక్షంగా దర్శనమిచ్చినట్లు చెబుతారు. రామానుజాచార్యుడి ముఖ్యశిష్యుడైన కరుదాళ్వార్కు ఈ స్వామి మహిమతోనే కంటిచూపు తిరిగి వచ్చిందట.
విమాన గోపురంపై బంగారుపూత
అళగర్ కోవిల్ దగ్గర ప్రకృతి మిమ్మల్ని మరోలోకానికి తీసుకెళుతుంది. 180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం ఈ ఆలయపు వైభవాన్ని గుర్తుచేస్తుంది. సుందరపాండ్యన్ అనే రాజు 13వ శతాబ్దంలో విమానం గోపురం మీద పోయించిన బంగారపు పూత సూర్యకాంతికి మెరిసిపోతుంటుంది.
ఈ ఆలయంలో ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేశారు. దీనిని దొంగిలించేందుకు ఓసారి 18 మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారట.అప్రమత్తంగా ఉన్న పూజారులు ఆ దాడిని తిప్పికొట్టారు..ఆ సమయంలో ‘కరుప్పుస్వామి’ అనే కావలి దేవత కనిపించి ఇకపై తాను ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తుంటానని మాట ఇచ్చాడట. ఆలయం వెలుపల ఉన్న కరుప్పుస్వామి రూపాన్ని సామాన్య భక్తులు చూసి తట్టుకోలేరట.. అందుకే ఈ ఆలయం తలుపులు ఏడాకి ఓసారి మాత్రమే తీస్తారు. ఈ ఆలయం తలుపులు తెరిచిన రోజు ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోతుందని చెబుతారు అక్కడి పూజారులు.
అళగిరి కోవిల్లో తిరుమాళ్ స్వామివారితో పాటుగా వారి సతీమణ ‘సుందరవల్లి తాయార్’ ఆలయం కూడా చూడవచ్చు. వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. వీటితో పాటు నరసింహస్వామి, చక్రత్తాళ్వార్, వినాయకు, ఆండాళ్ దేవతల విగ్రహాలూ దర్శనమిస్తాయి. ఇక ఆలయంలో రథమండపం, కళ్యాణ మండపం, వసంత మండపం, అలంకార మండపం… ఇలా అనేక కట్టడాలు అద్భుతమైన శిల్పాలతో ఆకట్టుకుంటాయి.
గమనిక: పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా రాసిన కథనం. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..