డిప్యూటీ సిఎం రాజన్నదొర నోటి వెంట మళ్లీ ఎంపీ సీటు మాట తెరపైకి రావడం పార్టీ శ్రేణుల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. గత కొంతకాలంగా ఆయన అప్పుడప్పుడు కాకతాళీయంగా ఎంపి కావాలన్న కోరికను వ్యక్తపరుస్తూ వస్తున్నారు. అయితే ఎంపిగా పోటీ చేయాలనే కోరిక మాత్రం ఆయన మనసులో బలంగా ఉంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన డిప్యూటీ సిఎం స్థాయి వరకు ఎదిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపిగా పోటీ చేయడమే మంచిదనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు తెలుస్తోంది
మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ ప్రకటించిన సీఎం జగన్
గ్రామ, మండల స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టి ఒత్తిళ్లకు గురై ఎమ్మెల్యేగా పోటీ చేయడం కన్నా ఎంపీగా పోటీ చేస్తే వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి కొంత సమయం దొరుకుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం ఆయన ఎంపిగా పోటీ చేయాలనే కోరికను బయటపెట్టారు. మండల వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఎంపీగా పోటీ చేయాలనే అభిప్రాయాన్ని ఉద్దేశపూర్వకంగానే చెప్పినట్లు అనిపించింది. సిఎం జగన్ మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ఎంపిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే అధిస్థానం దేనికి పోటీ చేయమంటే దానికి చేస్తానని కూడా చెప్పారు.
అరకు ఎంపీ సీటులో వైసీపీకి అడ్వాంటేజ్
అరకు ఎంపి నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరు ఎస్టీ, ఒక ఎస్సీ నియోజకవర్గం ఉండడంతో విజయం సునాయాసమవుతుందనే అభిప్రాయం ఆశావహుల్లో ఉంది. వైసిపి ఎంపి అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా గెలుపు సునాయాసమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిలో భాగంగానే రాజన్నదొర ఎంపి పల్లవి అందుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపిగా పోటీ చేసి గెలిస్తే వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి సమయం దొరుకుతుందని, ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందనే ఆలోచనతో రాజన్నదొర ఉన్నట్లు సమాచారం. ఆయన నోటి వెంట మళ్లీ ఎంపీ మాట రావడం వెనుక వ్యూహాత్మక అడుగులతో పాటు ఉద్దేశపూర్వకమైన అభిప్రాయం కూడా వుందని స్పష్టమవుతోంది
ఎంపీ అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేసిన సీఎం జగన్
ఎంపి అభ్యర్థిగా పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని పార్టీ ప్రకటించింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భాగ్యలక్ష్మిని తప్పించి వేరొకరికి సీటు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి సీటు ఆశిస్తున్న ఎస్టీ భగత సామాజిక వర్గానికి చెందిన నాయకులు స్వాతిరాణి రేసు లో ఉన్నారు. ఇప్పుడు అదే రేసులోకి రాజన్నదొర కూడా చేరడంతో సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఒకవేళ రాజన్నదొర ఎంపిగా వెళ్తే తనకు సాలూరు ఎమ్మెల్యే సీటు కావాలని కూడా స్వాతీరాణి కోరుతున్నారు. స్వాతిరాణి భర్త గుల్లిపిల్లి గణేష్‌ది సాలూరు కావడంతో పాటు నియోజకవర్గంలో ఆయనకు బలమైన సామాజిక సంబంధాలు వున్నాయి. ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేసిన స్వాతిరాణికి మన్యం జిల్లాతో పాటు, నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నాయకులతో పరిచయాలు ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో తాను ఎమ్మెల్యేకైనా పోటీకి సిద్ధమేనన్న సంకేతాలు పంపించారు.