శంకర్ యాదవ్ కు హ్యాండిచ్చి వైసీపీ నేతకు టిక్కెట్ – తంబళ్లపల్లెలో చంద్రబాబు రాంగ్ రూట్ !

వైసీపీ ప్రభుత్వంలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని ఓడించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత సోదరుడు, తంబళ్లపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యేపెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని నారా చంద్రబాబు నాయకుడు ప్లాన్‌ చేశారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు శంకర్‌ను కాదని మరో నాయకుడికి ఎమ్మెల్యే సీటు కేటాయించడం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

శంకర్ కాకపోతే ప్రవీణ్ ఉన్నా… వైసీపీ నుంచి వచ్చిన రామచంద్రారెడ్డికి టిక్కెట్

తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే లక్ష్మిదేవమ్మతో పాటు ఆమె కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి కూడా టీడీపీ టిక్కెట్‌ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ వర్గం (బీసీ) కావడం, తంబళపల్లెలో ఓ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో నారా చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఎమ్మెల్యే సీటు ఇచ్చే విషయంలో రెడ్డి సామాజికవర్గాన్ని ఎంచుకున్నారు. ఆ సామాజిక వర్గం ఓట్లు ఆ వర్గంతోనే చీలిపోతాయని అనుకుంటున్నారు. చివరి నిమిషయంలో పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి మీద పోటీకి జయచంద్రా రెడ్డిని రంగంలోకి దింపారు.

మొన్నటిదాకా వైసీపీ నేత జయచంద్రారెడ్డి

జయచంద్రారెడ్డి మొన్నటిదాకా వైసీపీ నాయకులు. అయితే పెద్దిరెడ్డితో గొడవలతో ఆయన పార్టీ మారిపోయారు. కానీ వైసీపీ నాయకులు జయచంద్రా రెడ్డిని అనేక ఇబ్బందులకు గురిచేశారని, అధికారుల అండతో ఆయన్ను జిల్లా నుంచి బహిష్కరించాలని ప్లాన్‌ చేశారని ఆయన ప్రచారం చేసుకున్నారు. ఇదే విషయంలో స్థానికంగా జయచంద్రా రెడ్డి మీద సానుభూతి పెరిగిందని అంటున్నారు. అయితే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సులభంగా విజయం సాధించిన పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అంత సులభంగా గెలిచే అవకాశం లేదని ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు.

శంకర్ యాదవ్ కు హ్యండిచ్చినట్లే !

తంబళ్లపల్లె నియోజక వర్గంలో భూముల లావాదేవీల విషయంలో, కాంట్రాక్టు పనులు కేటాయింపు విషయంలో, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసిపి మీద విసుగు చెందిన స్థానిక ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే, బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న శంకర్‌కు నచ్చచెప్పి ఈసారి తంబళ్లపల్లె ఎమ్మెల్యే సీటు జయచంద్రా రెడ్డికి ఇచ్చారని అంటున్నారు. అయితే శంకర్ యాదవ్ అనుచరులు.. చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేశారు. మొత్తం మీద తంబళ్లపల్లె నియోజక వర్గంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయని ఓటర్లు అంటున్నారు.