మాయావతికి షాక్ – ఖాళీ అవుతున్న బీఎస్పీ

దళితుల అభ్యున్నత కోసం కన్షీరాం ప్రారంభించిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) క్రమంగా ఏకవ్యక్తి పార్టీగా మారుతోంది. ఆ పార్టీలో ఉండేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. మాయావతి ఒంటెత్తు పోకడలతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని నేతలు గ్రహిస్తున్నారు. విశాల జనహితం కంటే మాయావతి స్వయం పరపతికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రజాసంక్షేమానికి పనిచేయకుండా ఆశ్రితపక్షపాతానికి పెద్ద పీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంపీలకు సైతం మాయావతి అందుబాటులోకి రాకపోవడంతో ఇక బీఎస్పీలో ఉండి లాభం లేదని వారు డిసైడైపోయారు…

బీజేపీలో చేరిన రితేష్ పాండే…

బీఎస్పీకి గత లోక్ సభ ఎన్నికల్లో 19 శాతం ఓట్లు వచ్చాయి. పది మంది ఎంపీలు గెలిచారు. పార్టీ దెబ్బతింటున్న సంగతి తెలిసి కూడా మాయావతి తీరులో మార్పు రాలేదు. ఆమె ఏకపక్షంగానే వ్యవహరిస్తూ వచ్చారు. దానితో ఇప్పుడు పార్టీ ఖాళీ అవుతోంది. బీఎస్పీ అంబేద్కర్ నగర్ ఎంపీ రితేష్ పాండే అకస్మాత్తుగా ఫిరాయించేశారు. ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు విజయంత్ జయపాండా , యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. చాలా రోజులుగా రితేష్ పాండే, బీఎస్పీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. విద్యాధికుడై, పార్లమెంటు చర్చల్లో విస్తృతంగా పాల్గొనే పాండేకు బీఎస్పీ తగిన గౌరవం లభించలేదు. పార్టీ నుంచి తన రాజీనామా లేఖను మాయావతికి పంపుతూ ఆయన అనేక ఆరోపణలు చేశారు. తనను పార్టీ మీటింగులకు పిలవడం లేదని, మాయావతిని కలవాలని చేసిన ఎలాంటి ప్రయత్నాలు ఫలించలేదని ఆయన వాపోయారు.

మరికొందరి పక్కచూపులు….

కనీసం ఐదుగురు ఎంపీలు బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు పక్క పార్టీలతో టచ్ లో కూడా ఉన్నారు. ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీలో చేరిపోయారు. ఆయన రాజకీయ నాయకుడిగా మారిన డాన్ ముక్తార్ అన్సారీకి స్వయాన సోదరుడు. అమ్రోహా ఎంపీ డేనిష్ అలీ, కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆయన్ను మాయావతి బీఎస్పీ నుంచి సస్పెండ్ చేశారు. జాన్ పూర్ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్ రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. దానితో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు…

దూడుకు మీదున్న బీజేపీ

అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో బీజేపీ దూకుడు మీదుంది. త్వరలోనే యూపీకి సంబంధించి 16 ఎంపీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించబోతోంది. గత ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ గెలిచిన చోట ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే ప్రచారం సులువు అవుతుందని భావిస్తున్నారు. మరో పక్క రితేష్ పాండేను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అంబేద్కర్ నగర్ నుంచే పోటీ చేయిస్తారని వార్తలు వస్తున్నాయి….