నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థికమంత్రి. దేశాన్ని మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా మార్చే ప్రయత్నంలో అహర్నిశలు కష్టపడుతున్న నాయకురాలు. ఆర్థిక రంగ నిపుణురాలిగా కూడా ఇప్పుడు పేరు పొందారు. నిర్మలమ్మ బడ్జెట్ అన్ని వర్గాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థికవేత్తలు చెబుతారు. కీలక పదవికి ప్రధాని మోదీ స్వయంగా ఆమెను ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి ఎలాంటి లోపాలు లేకుండా ఆమె తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పార్టీకి కూడా ఆమె పట్ల విశ్వాసం పెరిగింది…
తమిళనాడు, తెలంగాణలో ప్రచారం..
నిర్మలమ్మ తమిళనాడులో పుట్టారు. ఢిల్లీలో, విదేశాల్లో చదువుకున్నారు. విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు. తర్వాతే బీజేపీలో చేరారు. పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఆమె సేవలను గుర్తించడం వల్లే కేంద్ర మంత్రి పదవి దక్కింది. తొలుత రక్షణమంత్రిగా చేశారు. ఇప్పుడు ఆర్థికమంత్రిగా మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రధాని మోదీ ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో నిర్మలా సీతారామన్ కు కీలక బాధ్యత అప్పగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళనాడుతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొనాలని మోదీ చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. తమిళనాడులో పుట్టి పెరిగినందున ఆమెకు తమిళం బాగానే వచ్చు. అక్కడ గ్రాస్ రూట్లోకి వెళ్లిపోయి పనిచేయగలరు. పార్టీ తమిళనాడు శాఖాధ్యక్షుడు అన్నామలై ఎంత దూకుడున్న నాయకుడో అందరికీ తెలుసు. నిర్మలా సీతారామన్ ఎలాంటి దూకుడు లేకుండా స్మూత్ గా ప్రజలను ప్రభావితం చేయగలరు. రెండో వైపు నుంచి నరుక్కు రాలగరు. ఇక తెలంగాణ ఆమెకు మెట్టినిల్లు. నిర్మలమ్మకు హైదరాబాద్ తో అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే తెలంగాణలో కూడా ప్రచారం చేయాలని ప్రధాని మోదీ ఆమెను ఆదేశించినట్లుగా చెబుతున్నారు..
పుదుచ్చేరి నుంచి పోటీ చేయాలని వినతి…
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న నిర్మలా సీతారామన్, ఈ సారి లోక్ సభకు పోటీ చేస్తారన్న చర్చ కూడా బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. పుదుచ్చేరిలోని ఏకైక లోక్ సభా స్థానం నుంచి ఆమెను పోటీ చేయించాలని భావిస్తున్నారు. పుదుచ్చేరి బీజేపీ ఇటీవల నిర్వహించిన అంతర్గత సమావేశంలో లోక్ సభకు ఆశావహులుగా ఏడు పేర్లను ప్రస్తావించారు. అందులో నెంబర్ వన్ ప్లేస్ లో నిర్మలా సీతారామన్ ఉన్నట్లుగా చెబుతున్నారు. స్థానిక పరిస్థితులకు నిర్మలా సీతారామన్ అభ్యర్థిత్వం సరిగ్గా సరిపోతుందని పుదుచ్చేరి బీజేపీ నేతలు అంటున్నారు. ఆమె పోటీ చేయాలని అభ్యర్థించారు.
తొలి జాబితాలో పేరు ఉంటుందా….
త్వరలోనే బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నారు. అందులో మోదీ,అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ సహా 150 మంది పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. నిర్మలమ్మను పోటీ చేయించాలని భావించిన పక్షంలో తొలి జాబితాలోనే ఆమె పేరు ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఆమె పోటీ, ప్రచారమూ రెండు విధులను నిర్వహించాల్సి ఉంటుంది.