మార్చి 1న విశాఖకు ప్రధాని మోదీ – అప్పటికి ఏపీ రాజకీయంపై స్పష్టత ?

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1న విశాఖకు రానున్నట్లు తెలుస్తోంది. రూ.26 వేల కోట్ల ఖర్చుతో నవీకరించిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రిఫైనరీతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఏయూ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. అప్పటికి ఏపీ రాజకీయాల్లో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

26వ తేదీన వర్చువల్ ఓపెనింగ్

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ ల్యాబ్‌ను ప్రధాని మోదీ ఈ నెల 26న ‘వర్చువల్‌’గా ప్రారంభిస్తారు. గతంలో దీనికి ఉన్న ప్రాంతీయ ఫుడ్‌ ల్యాబొరేటరీ హోదాను కేంద్రం రూ.4.5 కోట్లతో రాష్ట్ర స్థాయికి పెంచింది. అత్యాధునిక పరికరాల కోసం రూ.14 కోట్లను కేటాయించి.. ఇప్పటికే రూ.8 కోట్లను మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో పరికరాలు, యంత్రాలు సమకూరితే ఏడాదికి సుమారు 20 వేల ఆహారం, నీటి నమూనాలను పరీక్షించేందుకు వీలు ఏర్పడుతుంది. దీంతో పాటు ప్రభుత్వానికి అదనంగా ఆదాయమూ సమకూరుతుంది. మరోవైపు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో, తిరుపతిలోని టీటీడీ భవనంలోనూ రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.18 కోట్ల చొప్పున విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.07 కోట్లతో తీసుకువచ్చిన నాలుగు ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ ల్యాబ్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

ఒకటో తేదీకి పొత్తులపై స్పష్టత

ఏపీలో ఇప్పుడు ఎన్నికల పొత్తులు రాజకీయ ఉత్కంఠ పెంచుతున్నాయి. జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన పొత్తు ఖాయం చేసుకున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ తమ రెండు పార్టీలతో బీజేపీ కలిసి రావాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి చేయటం దాదాపు ఖాయమైందనే వార్తలు వచ్చాయి. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దబాటు పైన చర్చలు జరిగాయి. కానీ, పొత్తు పైన ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో, మూడు పార్టీల్లోనూ పొత్తుల పైన సస్పెన్స్ నెలకొంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు.

ప్రధానితో పాటు పాల్గొననున్నసీఎం జగన్

అధికారిక కార్యక్రమం కావడంతో ప్రధాని తో పాటుగా సీఎం జగన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత వారం ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు భేటీ తరువాత ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం కావటం రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణమైంది. వచ్చే వారం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పైన ప్రకటన ఉంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇంకా తేల్చకపోతే ముందుకే వెళ్లే ఆలోచనలో చంద్రబాబు, పవన్ ఉన్నారని సమాచారం. ఇక, ప్రధాని పర్యటన వేళ కీలక నిర్ణయాలు ఉంటాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.