త్రిమూర్తులు ఒకే దగ్గర కొలువైన ఆలయం!

బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వేర్వేలుగా ఆలయాలు ఉండడం చూస్తుంటాం. కానీ ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురూ కొలువు తీరి ఉండటం చాలా అరుదు. అయితే త్రిమూర్తులు ముగ్గుర్నీ ఒకేదగ్గర దర్శించుకోవాలంటే తమిళనాడు లో ఈరోడ్ దగ్గరున్న కొడుముడి దేవాలయానికి వెళ్లాల్సిందే.

ముఘ్దేశ్వరుడిగా శివుడు
ఇక్కడి శివుడిని ముఘ్దేశ్వర్ అని, అమ్మవారిని సౌందర్యవల్లి అని అంటారు. పురాణగాథ ప్రకారం ఆదిశేషుడికి, వాయు దేవుడికి మధ్య బలం విషయంలో వాదోపవాదాలు జరిగాయి. ఇద్దరు మేరు పర్వతం దగ్గరకి వచ్చి యుద్ధానికి తలపడ్డారట. ఆదిశేషుడు మేరు పర్వతాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా వాయు దేవుడు తన శక్తి మేర గట్టిగా ఊదితే ఆ ప్రతాపానికి మేరు పర్వత శిఖరం అయిదు ముక్కలుగా విరిగి వివిధ ప్రదేశాల్లో పడింది. అలా వజ్రంతో సమానమైన మేరు పర్వత శిఖర భాగం వచ్చి ఈ కొడుమూడిలో పడి శివలింగ రూపం దాల్చిందని అదే ముఘ్దేశ్వర శివలింగం అని చెబుతారు
శివుడి పెళ్లి జరిగిన తరువాత పార్వతి దేవితో కలిసి అగస్త్య మహర్షికి ఈ ప్రదేశంలోనే దర్శనమిచ్చాడట. అలాగే భరద్వాజ మహర్షికి శివుడి తాండవం చూసే అదృష్టం కూడా ఈ ప్రదేశంలోనే కలిగిందని పురాణగాథ. ఈ ఆలయ ప్రాంగణంలోనే భరద్వాజ తీర్థం, దేవ తీర్థం, బ్రహ్మ తీర్థం అనే మూడు తీర్థాలని మనం చూడవచ్చు.

నారాయణ పెరుమాళ్ గా శ్రీ మహావిష్ణువు
ఇక్కడ శ్రీ మహావిష్ణువుని వీర నారాయణ పెరుమాళ్ అని అంటారు. అమ్మవారిని తిరుమంగ నాచియార్ అని పిలుస్తారు. పెళ్లి కాని వారు ఇక్కడ పరిహార పూజలు చేయించుకుంటే వెంటనే పెళ్లి కుదురుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. రాహు కేతువులకు కూడా పరిహార పూజలు చేసుకోవచ్చు. కుజదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.

చెట్టురూపంలో బ్రహ్మ
బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవనే శివుడి శాపం ఉంది కాబట్టి..ఇక్కడ బ్రహ్మదేవుడు చెట్టు రూపంలో ఉండడం విశేషం. వణ్ణి చెట్టుగా పేరుపొందిన ఈ మహావృక్షం దాదాపు 3000 సంవత్సరాలనాటిదని చెప్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఈ చెట్టుకున్న మరో విశేషం దీనికి ఒక వైపు ముళ్ళు ఉంటే మరో వైపు ఉండవు, అంతేకాదు దీనికి పళ్ళు పువ్వులు కూడా కాయవు. ఈ చెట్టు ఆకు ఒక్కటైనా ఒక బిందెడు నీళ్ళల్లో వేసి ఉంచితే ఆ నీళ్ళు ఎన్నాళ్లయినా పాడవ్వవు అని చెబుతారు.

కావేరి నది పక్కన ఉన్న ఈ ఆలయంలో ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు…

గమనిక: పండితులు చెప్పినవి, కొన్ని పుస్తకాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా రాసిన కథనం. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..