కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నారు. చట్టం పరిధిలో చేయాల్సిన ఏ పని ఆయన చట్టాన్ని ఉల్లంఘించకుండా చేయలేకపోతున్నారు. చిన్న విషయాలకు కూడా గొడవలు సృష్టించి… కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలో ఆయన కేసుల్లో ఇరుక్కుంటున్నారు. తోటి వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. అసోంలో నెల క్రితం ఆయన పాల్పడిన దుందుడుకు చర్యలు ఇప్పుడు రాహుల్ మెడకు చుట్టుకుంటున్నాయి….
గువహాటీ గొడవలపై పోలీసుల సీరియస్…
రాహుల్ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర గువహాటీ వచ్చినప్పుడు గొడవలు జరిగాయి. రాహుల్ సహా కేసీ వేణుగోపాల్, జీతేంద్ర సింగ్, జైరాం రమేష్, కన్హయ్య కుమార్, గౌరవ్ గగోయ్, భూపేన్ కుమార్ బోరా, దేబబ్రత సైకియాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు విచారణ ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో అసోం సీఐడీ (క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టమెంట్) రంగంలోకి దిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జకీర్ హూసేన్ కు ఇప్పటికే సమన్లు వెళ్లాయి. ఇక ఈ నెల 23న తమ ముందు హాజరు కావాలని గువహాటీ సిటీ జనరల్ సెక్రటరీ రామెన్ కుమార్ శర్మకు సమన్లు పంపారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి సమన్లు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. పోలీసులు పలిచిన పక్షంలో ఆయన జోడో యాత్రను ఆపి గువహాటీ వెళ్లాల్సి ఉంటుంది.
రూటు మారరాని ఆరోపణలు
కాంగ్రెస్ నేతలు పోలీసులు దగ్గర తీసుకున్న పర్మీషన్ కాకుండా తమ ఇష్టానుసారం వ్యవహరించారు. నిర్దేశిత మార్గంలో కాకుండా డీవియేట్ అయ్యారు. వద్దని పోలీసులు వారిస్తే వారిపై విరుచుకుపడ్డారు. గువహాటీ నగరంలోకి ఎంటర్ కావాల్సిందేనని భీష్మించుకున్నారు. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు తలపడ్డారు. ఈ క్రమంలో జోర్హాట్ జిల్లా పోలీసులు మరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇప్పుటికే పది మంది వరకు ప్రశ్నించారు. ఇప్పుడు అగ్రనేతలను ప్రశ్నించే సమయం వచ్చిందని పోలీసులు అంటున్నారు…ఇప్పటికే కొందరికి నోటీసులు చేరాయని తెలుస్తోంది…
ఆ రోజు అసలేం జరిగింది…?
జనవరి 23న భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ, ఇతర నేతల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల బారికేడ్ను బద్దలు కొట్టారు. యాత్ర ప్రధాన నగరమైన గువహాతీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించడంతో ఈ అడ్డంకులు ఏర్పడ్డాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జి చేయాల్సి వచ్చినా బారికేడ్లు పగలకుండా కాపాడలేకపోయారు.ఈ ఘర్షణలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు. రూటు మారవద్దని అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ హెచ్చరించినప్పటికీ వాళ్లు ఎవరూ వినలేదు. దానితో కొంత గందరగోళ పరిస్తితి ఏర్పడింది. గువహాటీ, జోర్హాట్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.