చిత్తూరు రాజకీయం డబ్బు చుట్టూ తిరుగుతోంది. వైసిపి చిత్తూరు నియోజకవర్గ బరిలో దింపిన ఎంసీ విజయానందరెడ్డికి ధీటైన వ్యక్తిగా గురజాల జగన్మోహన్‌ను టిడిపి అభ్యర్థిగా ఖరారు చేయనున్నట్లు టిడిపి నేతలు భావిస్తున్నారు. గురజాల జగన్మోహన్ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు అయినట్లేనని చెబుతున్నారు.
విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్న గురజాల జగన్మోహన్
చిత్తూరు నియోజక వర్గంలో గురజాల జగన్మోహన్ సేవా కార్యక్రమాలతో లేదా బడుగు, బలహీన వర్గాలకు సాయం పేరుతో విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. గుడిపాల మండలానికి చెందిన గురజాల జగన్మోహన్ నాయుడు ఇటీవల కాలంలో క్రియాశీలకమయ్యారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలోని జరుగుతున్నాయి. పేదలకు నాలుగు చక్రాల బండ్లను పంచడం, నిత్యావసర వస్తువులు పంచడం తదితర కార్యక్రమాలతో జగన్ మోహన్ నాయుడు ప్రజల్లోకి వెళుతున్నారు. దాన ధర్మాలు కూడా చేస్తున్నారు. యువగళం ముగింపు యాత్రకు కూడా ఆయన 40 లక్ష రూపాయల వ్యయంతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
ఫ్లెక్సీలకే కోట్లలో ఖర్చు
అప్పటివరకు నగరంలో అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు, భారీ కటౌట్ల స్థానంలో ప్రతిపక్ష టిడిపి ముఖ్య నేతల ఫ్లెక్సీలు, బేనర్లు, కటౌట్లు గోడ పత్రికలు వెలిశాయి. గురజాల జగన్మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలను అనతి కాలంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చిత్తూరు టికెట్ గురజాలకు ఖరారు అయిన వెంటనే అధికార పార్టీ నుండి ద్వితీయ శ్రేణి నాయకత్వం, కొందరు కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు టిడిపి కండువాలు కప్పుకుంటారని ప్రచారం చేస్తున్నారు. టిడిపిలో అప్పటి వరకు ఓ రకంగాను, గురజాల జగన్మోహన్ అడుగుపెట్టాక మరో విధంగా మారిపోయింది. చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు అర్బన్, రూరల్, గుడిపాల మండలాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు, టిడిపి అనుబంధ సంఘాలకు ఆయన డాబు, దర్పం హాట్ టాపిక్ గా మారింది.
జనసేన నాయకత్వానికీ మంచి రేటు
జనసేన నాయకత్వం గురజాల జగన్మోహన్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ గురజాల జగన్మోహన్ అయితేనే చిత్తూరులో విజయ అవకాశాలు ఉంటాయని బలంగా చెబుతున్నారు. వారందరికీ జగన్మోహన్ బాగా ముట్టచెప్పారని అంటున్నారు. గురజాల జగన్మోహన్ చిత్తూరు నుండి పోటీ చేస్తే గుడిపాల సొంత మండలం కావడం కలిసొస్తుందని టిడిపి అనుకుంటోంది. అయితే డబ్బులతోనే రాజకీయం నడవదని..ఇతర పార్టీల నేతలు.. టీడీపీ నేతలు కూడా అంటున్నారు. చంద్రబాబు ఏం చేస్తారో చూస్తామని అంటున్నారు.