వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్టు దక్కలేదని అలకబూనిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మెత్తబడుతున్నట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి పెద్దిరెడ్డిని కలవకుండా దూరందూరం ఉంటూ వచ్చిన ఆ ఇద్దరు ఇప్పుడు వైసిపి ముఖ్య నేతలకు టచ్లోకి వెళ్తున్నారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి శుక్రవారం నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. ఆయనతోపాటు అసంతృప్తి నేతలుగానున్న ఇస్మాయిల్ కూడా పెద్దిరెడ్డిని కలిశారు.
అలక వీడిన నేతలు
గతంలో ఈ నేతలను కలసేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నించినప్పటికీ అందుబాటులో లేకుండాపోయారు. దీంతో సిద్దారెడ్డి పార్టీకి దూరమవుతున్నారా అన్న చర్చ అప్పట్లో నడిచింది. ఇప్పుడు ఉన్నట్టుండి పెద్దిరెడ్డి ముందుకు అసంతృప్తి నేతలంతా కలవడం చూస్తే అలక వీడినట్టు కనిపిస్తోంది. దీనికి కొన్ని ఆర్థికపరమైన కారణాలూ లేకపోలేదన్న అభిప్రాయం వైసిపి వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. పార్టీని వీడితే ఆర్థికపరమైన సమస్యలు వెల్లువెత్తుతాయని తెలియడంతో మెత్తబడినట్లుగా చెబుతున్నారు.
వైసీపీలోనే కాపు రామచంద్రారెడ్డి !
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. అధిష్టానం టచ్లో ఉందని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతకరించుకుంది. కొత్త సమన్వయకర్తను నియమించిన సమయంలో అధిష్టానంపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాడేపల్లికి సెల్యూట్ అని సెల్యూట్ చేసి మరీ వచ్చారు. అనంతరం కూడా తాను స్వతంత్రంగానే రాయదుర్గం, కళ్యాణదుర్గం పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అంతేకాకుండా స్థానిక వైసిపి నాయకులతోపాటు, కొత్త సమన్వయకర్త మెట్టుగోవిందరెడ్డితో పలుమార్లు బాహాటంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు అధిష్టానంతో టచ్లో ఉందని, అవకాశం లభిస్తే వెళ్లి కలుస్తానని కూడా ప్రకటించారు. దీన్ని బట్టి ఆయన వైసిపిలోనే ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చక్రం తిప్పుతున్న పెద్దిరెడ్డి
తిరుగుబాటు బావుటా ఎగరేస్తారనుకున్న నేతలిద్దరూ పాత గూటి వైపే అడుగులేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అసంతృప్తులుగానున్న ఈ ఇద్దరు నేతలు అలకవీడితే వైసిపిలో అసంతృప్తులు దాదాపుగా లేనట్టుగానే అవుతుంది. ఇప్పటి వరకు ప్రకటించిన కొత్త సమన్వయకర్తల్లో పూర్తిగా టిక్కెట్టు లేకుండా ఉన్నది నాలుగు స్థానాలు మాత్రమే అందులో కదిరి, రాయదుర్గం ఒక్కటే అసంతృప్తితోనున్నది. మార్పు జరిగిన శింగనమల, మడకశిరలో అసంతృప్తులున్నా సిట్టింగ్ మాత్రం పార్టీ వెంటనే ఉంటూ వచ్చారు. వైసిపిలో క్రమక్రమంగా అన్నీ సెట్ అవుతూ వస్తున్నాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడైనా అసంతృప్తులున్నా అన్నింటినీ సెట్ చేస్తున్నారు. అలకబూనిన నేతలతో ప్రత్యేకంగా చర్చించి దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు