మమతకు దూరమవుతున్న టోలీవుడ్…

రాజకీయాల్లో యువతకు అవకాశం ఇవ్వాలి. అన్ని వర్గాలను కలుపుకుపోవాలి. పదవుల్లో సమాన అవకాశాలు కల్పించాలి.. పార్టీలు నడిపే నాయకులు ఇలా రోజు వారీ చెబుతుంటారు. ఆచరణలో మాత్రం కొందరే వాటిని పాటిస్తుంటారు. అధికారం మొత్తం తమ చేతిలోనే ఉండాలని, తాము అనుకున్నదే జరగాలని భీష్మించుకునే నాయకులు కొందరు ఉంటారు. అలాంటి వారి పార్టీలో ఆత్మాభిమానం ఉన్న వాళ్లు ఎక్కువ కాలం పనిచేయలేరు. దణ్ణంపెట్టి వెళ్లిపోతుంటారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ లో కూడా అదే జరుగుతోంది. మమత పరివారం తీరు నచ్చక నేతలు వెళ్లిపోతున్నారు. అందులో టోలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు…

మిమీ చక్రబోర్తీ నిష్క్రమణ

బెంగాల్ సినిమాను కూడా టోలీవుడ్ అని పిలుస్తారు. 2019 ఎన్నికల్లో టోలీవుడ్ స్టార్స్ మిమీ చక్రబోర్తీ, నుస్రత్ జహాన్ తో పాటు కొందరు టోలీవుడ్ స్టార్స్ కు తృణమూల్ టికెటిచ్చింది. జాధవ్ పూర్ నియోజకవర్గం నుంచి మిమీ గెలిచారు. బసీర్హాత్ లో నుస్రత్ విజయం సాధించారు. వారితో పాటు నటుడు దేవ్ అధికారి కూడా తృణమూల్ తరపున ఘటల్ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆయన బెంగాల్ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడు. ఆ ముగ్గురిని తృణమూల్ కాంగ్రెస్ లో టోలీవుడ్ బ్రిగెడ్ అని పిలుస్తారు. కాలచక్రంలో ఐదేళ్లు గిర్రున తిరుగుతున్న తరుణంలోనే ఆ బ్రిగేడ్ పార్టీకి దూరమవుతున్న అనుభూతి కలుగుతోంది. జాధవ్ పూర్ ఎంపీ స్థానానికి మిమీ చక్రబోర్తీ రాజీనామా చేశారు. పైగా తాను రాజకీయాలకు పనికిరానని అందుకే వెళ్లిపోతున్నానని ప్రకటించారు. ఇతరులను ప్రమోట్ చేయడం తనకు ఇష్టం లేదన్న ఆమె స్టేట్ మెంట్ ఎవరినీ ఉద్దేశించినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్థానిక తృణమూల్ నేతలతో పడకనే ఆమె రాజీనామా చేశారన్న చర్చ కూడా జరుగుతోంది..

ప్రభుత్వ కమిటీల నుంచి తప్పుకున్న దేవ్ అధికారి

నిజానికి దాదాపు మూడు లక్షల భారీ మెజార్టీతో మిమీ గెలిచారు. పదవిని చేపట్టిన మొదటి రోజు నుంచే ఆమెలో అసంతృప్తి మొదలైంది. పార్టీలో పెత్తందార్లు ఉన్నారని గ్రహించి ఆమె తీవ్ర నిరాశకు లోనయ్యారు. 2022లో కూడా మిమీ రాజీనామా చేయగా.. మమతా బెనర్జీ దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు ఆమె ఫైనల్ గా చెప్పాలనుకున్నది చెప్పేశారు.ఇక లోక్ సభ సభ్యుడు దేవ్ అధికారి కూడా అంత సంతోషంగా లేరు. ప్రభుత్వ కమిటీల నుంచి ఆయన రాజీనామా చేశారు. పార్టీ వారికి దూరంగా ఉంటున్నారు. ఆయనది కూడా మిమీ టైపు ప్రాబ్లమేనని చెప్పాలి. నియోజకవర్గం నేతలు ఆయనకు సహకరించడం లేదు. పశువుల స్మగ్లింగ్ కేసులో సీబీఐ తనను ప్రశ్నించిన తర్వాత దేవ్ అధికారి కాస్త భయాందోళనలకు లోనైన మాట వాస్తవం.వరుసగా మూడో సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు దేవ్ అధికారి ఆసక్తి చూపడం లేదు..

నుస్రత్ జహాన్ పై ఈడీ నజర్

సందేశ్ ఖలీ వ్యవహారంలో నుస్రత్ జహాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆదివాసీలపై తృణమూల్ గూండాలు దాడి చేసిన సందేశ్ ఖలీ… నుస్రత్ నియోజకవర్గమైన బసీర్హాత్ పరిధిలోకి వస్తుంది. పైగా ఆమెకు రాజకీయాలపై పెద్ద ఆసక్తి ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. సందేశ్ ఖలీ వైపు కనీసం తొంగి చూడటానికి కూడా ఇష్టపడని నుస్రత్ జహాన్.. వాలెంటైన్స్ డే రోజున భర్తతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసి విమర్శల పాలయ్యారు. పైగా చీటింగ్ కేసులో ఈడీ ఆమెపై కేసు పెట్టింది. కోల్ కతాలో ఫ్లాట్లు ఇస్తామంటూ ఆమెకు చెందిన కంపెనీ సీనియర్ సిటిజన్స్ డబ్బును దోచుకుందన్న ఆరోపణలున్నాయి. ఈ సారి ఎన్నికల్లో నుస్రత్ కూడా పోటీ చేయకపోవచ్చు.