ఏపీలో బీజేపీ దేనికైనా రెడీ అయింది. పొత్తులు ఉంటాయా లేదా అన్న సంగతిని మైండ్ లో పెట్టుకోకుండా.. ఒంటరి పోరు చేయాల్సివస్తే అన్ని నియోజకవర్గాల్లోనూ గట్టి పోటీ ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగానే కార్యాచరణ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పల్లెకు పోదాం కార్యక్రమంతో కార్యకర్తల్ని కలిసేలా కార్యక్రమం నిర్వహించిన ఏపీ బీజేపీ నేతలు తాజాగా.. ప్రజాపోరుతో ప్రతీ నియోజవకర్గాన్ని చుట్టేయబోతున్నారు. కార్యకర్తల్ని యాక్టివ్ చేయబోతున్నారు.
ప్రజాపోరు నిర్వహణ వెనుక ఎవరూ ఊహించని వ్యూహం
ప్రజాపోరు సభలను విస్తృతంగా నిర్వహించాలని బీజేపీ హైకమాండ్ సూచించడం .. ఆ కార్యక్రమానికి విష్ణువర్ధన్ రెడ్డిని కన్వీనర్ గా కొనసాగించాలని ఆదేశించడం వెనుక హైకమాండ్ ప్రత్యేక వ్యూహం ఉందని భావిస్తున్నారు. పొత్తులు ఉంటాయని కొంత మంది నేతలు నమ్మకంగా ఉన్నప్పటికీ.. పొత్తులతో సంబంధం లేకుండా పార్టీని బలోపేతం చేయాలన్న ఆకాంక్షతో ఉండే విష్ణువర్ధన్ రెడ్డికి ఈ అవకాశం ఇవ్వడం వెనుక వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజాపోరు ద్వారా విష్ణువర్ధన్ రెడ్డి క్యాడర్ ను ఏకం చేయనున్నారు.
పొత్తులతో పని లేదు.. పోటీకి అన్ని చోట్లా సిద్ధం !
అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ వారిని ఏకతాటిపైకి తెచ్చే నాయకత్వమే బలహీనంగా ఉంది. ప్రజాపోరు సభల ద్వారా ఈ కొరత తీర్చాలని విష్ణువర్ధన్ రెడ్డి అనుకుంటున్నారు. నియోజకవర్గాల్లో బలమైన నేతల్ని.. ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన ప్రత్యేకమైన వ్యూహం అవలంభిస్తుంది. ఎన్నికలను సైతం ఎదుర్కొగలిగే నేతల్ని ప్రజాపోరు సభల ద్వారా వెలుగులోకి తెచ్చి పార్టీలో మంచి భవిష్యత్ ఉండేలా ప్రోత్సాహం అందించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు పోటీ చేయమన్నా చేయగలిగే నేతల్ని విష్ణువర్ధన్ రెడ్డి రెడీ చేస్తున్నారు.
కింది స్థాయి క్యాడర్ బలోపేతానికి అత్యంత కీలకం ప్రజాపోరు
ప్రజాపోరు సభలు కింది స్థాయి క్యాడర్ బలోపేతానికి ఉపయోగపడతాయి. పార్టీ వాయిస్ ను.. పార్టీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే.. కింది స్థాయ క్యాడర్ ముఖ్యం. ఇప్పటి వరకూ ఆలాంటి క్యాడర్ ను కాపాడుకునే వ్యవస్థపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ప్రజా పోరుతో ఆ కొరతను తీర్చేందుకు విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నించే అవకాశం ఉంది.