ఉల్టా చోరో కొత్వాల్ కో డాంటే అన్నది ఒక హిందీ సామెత. అంటే దొంగోడే పోలీసులపై తిరగబడి కొట్టాడన్నది దాని అర్థం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇప్పుడు అదే ధోరణిలో ఉన్నారు. రౌడీయిజం, హింసాకాండ, దళితులు -గిరిజనులపై దమనకాండను ప్రోత్సహిస్తున్న ఆమె పనిలో పనిగా పక్క పార్టీలపై నెపం నెట్టేసేందుకు వెనుకాడటం లేదు. తప్పు చేస్తున్నావు అని చెబితే ఆమెకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తోంది. పైగా అసెంబ్లీ సాక్షిగా కూడా రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు….
ఆరెస్సెస్ పై అర్థం లేని ఆరోపణలు
సందేశ్ ఖలీలో ఆదివాసీలపై తృణమూల్ కాంగ్రెస్ గూండాల దాడులకు సంబంధించి పూర్తి సాక్ష్యాధాలున్నప్పటికీ బీజేపీ, ఆరెస్సెస్ పై ఆరోపణలు సంధించేందుకు మమతా దీదీ వెనుకాడటం లేదు. గిరిజన మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన నిజాలను ఆరెస్సెస్ బయటకు తెచ్చి వారికి న్యాయం చేయాలని చూస్తుంటే….విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, హింసాకాండను వాళ్లే ప్రోత్సహించారని ఆరెస్సెస్ పై మమత రాళ్లు విసురుతున్నారు. దీన్ని బీజేపీ తీవ్ర స్థాయిలో ఖండించింది. మమత ఇంత నిర్లజ్జగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని బీజేపీ సీనియర్ నేత కేంద్ర న్యాయ శాఖా మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
బయట నుంచి కార్యకర్తలు వచ్చారంటున్న మమత
అసెంబ్లీ సాక్షిగా బీజేపీపై బురద జల్లేందుకు మమత ప్రయత్నించారు. మైనార్టీలకు, ఆదివాసీలకు మధ్య ఘర్షణలు సృష్టించే క్రమంలో బయట నుంచి బీజేపీ కార్యకర్తలను, ఆరెస్సెస్ శ్రేణులను పట్టుకొచ్చారని ఆమె ఆరోపించారు. అక్కడ ఆరెస్సెస్ శాఖలను పెంచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారన్నారు. తృణమూల్ గూండాల దాడిలో బీజేపీ రాష్ట్ర శాఖాధ్యక్షుడు సుకంతా మజుందార్ తీవ్రంగా గాయపడితే ఆ నెపాన్ని కూడా బీజేపీ పైకి నెట్టి పడేసేందుకు ఆమె వెనుకాడలేదు. బీజేపీ నేతల కారు ఢీకొనే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని మమత కొత్త రాగం అందుకున్నారు..
సందేశ్ ఖలీలో మహిళ కమిషన్ బృందం
ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉండే సందేశ్ ఖలీలో పేద ప్రజల భూములను తృణమూల్ నేతలు ఆక్రమించుకున్నారు. పని చేసినందుకు కూలి అడిగితే దాడులు చేయడంతో పాటు పోలీసు కేసులు పెట్టారు. ఇప్పుడు సందేశ్ ఖలీలో పురుషులు ఇళ్లు వదిలి పారిపోగా మహిళలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ నిజనిర్థారణ కమిటీ సందేశ్ ఖలీలో పర్యటించగా వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆదివాసీలపై దాడులకు సంబంధించి స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిటీ గుర్తించింది. బాధితుల పక్షాన ఉండాల్సిన ప్రభుత్వం… దాడులు చేసిన వారిని కాపాడుతోందని కూడా నిజ నిర్థారణ కమిటీ తేల్చింది…