కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసిబొట్టు నాగం బొట్టు అన్నట్లుగా తయారైంది. ఔట్ గోయింగే కానీ, ఇన్ కమింగ్ లేదన్నట్లుగా పార్టీ వీడేవారు ఎక్కువయ్యారు. పార్టీలోకి వచ్చే వాళ్లు ఒకరు కూడా లేరు. పైగా వెళ్లు వెళ్లూ ఇంతటి నిరంకుళ, పనికిమాలిన పార్టీ మరోటి లేదని కూడా ఆరోపణలు సంధిస్తున్నారు.
ఇక మారడం కష్టమే – అశోక్ చవాన్
38 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో అశోక్ చవాన్ పనిచేశారు. ముఖ్యమంత్రి పదవిని కూడా వహించారు. రెండు సార్లు ఎంపీగా చేశారు. కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన ఆయన అకస్మాత్తుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక అక్కడ ఉండటం నా వల్ల కాదని చేతులెత్తేశారు. ఆయన వచ్చిందే తడవుగా అశోక్ చవాన్ సీనియారిటీని, సిన్సియారిటీని గుర్తించిన బీజేపీ తక్షణమే ఆయనకు రాజ్యసభ నామినేషన్ ఇచ్చేసింది..కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కారణాలను అశోక్ చవాన్ వివరిస్తుంటే..అసలా పార్టీలో జీవం మిగిలి ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పార్టీ నేతల్లో పోరాటతత్వం లోపించిందని అశోక్ చవాన్ విశ్లేషిస్తున్నారు. పోరాడకుండా ఎలా గెలుస్తారు. ఉత్తుత్తి పోటీల వల్ల ప్రయోజనం ఏమిటన్నది ఇప్పుడు అశోక్ చవాన్ వేస్తున్న ప్రశ్నలు…
బీజేపీకి అనుకూలం, కాంగ్రెస్ కు ప్రతికూలం
నిజానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. మిలింద్ దేవరా నుంచి అశోక్ చవాన్ వరకు చాలా మంది వెళ్లిపోయారు.ఇంకా కొంత మంది బయటకు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ దుస్థితికి ప్రస్తుతం మహారాష్ట్ర పాలిటిక్స్ ఒక మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. మహా వికాస్ ఆగాఢీలో లుకలుకల కారణంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ ఆ పార్టీలో పవర్ బ్రోకర్స్ తీరు మాత్రం మారలేదు. వారి పెత్తందారీతనం వల్ల సీన్సియర్ గా పనిచేసే వాళ్లు తీవ్ర అసౌకర్యానికి లోనై పార్టీని వదిలి వెళ్తున్నారు. అందరూ వెళ్లిపోతే తామొక్కరమే పెత్తనం చేలాయించే వీలుంటుందని ఆలోచించే వాళ్లు కూడా ఆ పార్టీలో ఉన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పాటోలే ఒంటెత్తు పోకడ నచ్చక చాలా మంది అసంతృప్తిగా ఉన్నా అధిష్టానం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
యువతకు అవకాశం లేని పార్టీ..
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికీ తానో యువనేతననే చెప్పుకుంటుంటారు.పార్టీ వారంతా ఆయన్ను యువనేతగా కొలుస్తుంటారు. వాస్తవానికి ఒకటి రెండు చోట్ల మినహా ఆ పార్టీలో యువతకు పెద్దగా అవకాశాలుండవు. పార్టీ నిత్యం పాతకాపుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పార్టీలో కొత్త నీరు పారించేందుకు ఎవరూ ప్రయత్నించరు. ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు లాంటి అంశాలపై ఉద్యమించేంత ఓపిక, టైమ్ ఆ పార్టీకి ఉండటం లేదు…