ఎన్నికల్లో టిడిపి, జనసేన ఉమ్మడిగా పోటీ చేయనున్నట్లు అధినాయకులు స్పష్టత ఇచ్చారు. సీట్ల పంపకంపై మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ వీడలేదు. దీంతో టిక్కెట్ ఆశిస్తున్న ఇరు పార్టీల నేతల్లోనూ టెన్షన్ నెలకొంది. జనసేనకు జిల్లాలో ఎన్ని సీట్లు కేటాయిస్తారో తెలియని పరిస్థితి ఉంది. బయట జరుగుతున్న ప్రచారం, వ్యక్తిగతంగా టిడిపి, జనసేన నాయకుల చర్చల్లో మాత్రం జనసేనకు జిల్లాలో ఐదు స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, కైకలూరు లేక ఏలూరు స్థానాలు కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇరుపార్టీల అధ్యక్షుల్లో ఎన్నికల పొత్తుపై స్పష్టతకు వచ్చినప్పటికీ టిక్కెట్ల విషయంలో మాత్రం క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య పొత్తు కుదిరే పరిస్థితి లేకుండా పోయిందనే చర్చ నడుస్తోంది.
గోదావరి జిల్లాల్లో టిక్కెట్ల కోసం తీవ్ర ఒత్తిడి
నరసాపురం టిక్కెట్ జనసేన తరపున బొమ్మిడి నాయకర్‌కు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఆయన ప్రచారానికి ఏర్పాట్లు సైతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతలో టిడిపి నాయకులు, శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ నాలుగు రోజుల క్రితం మాట్లాడుతూ నరసాపురం టిక్కెట్ ఎవరికీ కేటాయించలేదని, టిడిపి నాయకులు ఆందోళన చెందొద్దంటూ సముదాయించారు. టిడిపి తరపున టిక్కెట్ ఆశిస్తున్న వారిలో మాజీ ఎంఎల్ఎ మాధవనాయుడు, కొవ్వలి రామ్మోహన్నాయుడు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు ఉన్నారు. ఒకవేళ బొమ్మిడి నాయకర్‌కు టిక్కెట్ కేటాయించినా టిడిపి నాయకులు సహకరిస్తారా అనే అనుమానాలు నెలకొన్నాయి. భీమవరంలో జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ పోటీ చేయనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇక్కడ టిడిపి నాయకులు తోట సీతారామలక్ష్మి, కోళ్ల నాగేశ్వరరావు మధ్య రాజకీయ వైరం నడుస్తోంది. పవన్‌కల్యాణ్ పోటీ చేస్తే టిడిపి నేతలు సహకరించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అడిగిన సీట్లు ఇచ్చే ఉద్దేశంలో లేని టీడీపీ
ఉంగుటూరు నియోజకవర్గంలో టిడిపి తరపున గన్ని వీరాంజనేయులు, జనసేన నుంచి పత్సమట్ల ధర్మరాజు ఉన్నారు. ధర్మరాజు ఐదేళ్లుగా జనసేన తరపున పని చేస్తున్నారు. టిక్కెట్ కేటాయింపు తనకే అంటూ గన్ని, కాదు తనకే అంటూ ధర్మరాజు ఎవరి వాదన వారు కార్యకర్తలకు చెబుతున్నారు. పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించే అవకాశం ఉందనే మరో వాదన సైతం వినిపిస్తోంది. టిక్కెట్ ఎవరికి కేటాయించినా వేరే వారు సహకరించే పరిస్థితి ఉందా అంటే అనుమానమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏలూరు విషయానికి వస్తే ఇక్కడ టిడిపి తరపున బడేటి చంటి, జనసేన నుంచి రెడ్డి అప్పలనాయుడు ఉన్నారు. కొత్తగా జనసేన నుంచి తాను పోటీలో ఉన్నట్లు నారా శేషు హడావుడి చేస్తున్నారు. దీంతో టిక్కెట్ కేటాయింపులు పూర్తయిన తర్వాత ఇరుపార్టీల నేతల మధ్య సహకారం ఉంటుందా అనే అనుమానాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో టిడిపి తరపున వలవల బాబ్జి, జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ ఏ పార్టీకి కేటాయించినా మరోపార్టీతో సఖ్యత ఉంటుందో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది.
గోదావరి జిల్లాల పర్యటన వాయిదాకు కారణం ఏమిటి ?
టిక్కెట్ల కేటాయింపులో నెలకొన్న జాప్యం ఇరుపార్టీల నాయకుల మధ్య విబేధాలను మరింత పెంచుతోంది. దీంతో టిక్కెట్ కేటాయించిన తర్వాత నాయకుల మధ్య పొత్తు కుదిరేనా అనే చర్చ పెద్దఎత్తున నడుస్తోంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక.. టీడీపీ స్పష్టత ఇవ్వకపోవడం కారణంగానే గోదావరి జిల్లాల పర్యటనను హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వలేదని చెప్పి రద్దు చేసుకున్నారన్న చర్చ నడుస్తోంది.