భారతీయులంతా ఒకటై ఊపిరి పీల్చుకున్న ఘటన జరిగింది. అసలు వస్తారా రారా…అనుకున్న ఎనిమిది మంది సొంత గడ్డపై కాలు పెట్టారు. గూఢచర్యం కేసులో ఖతార్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన భారత నేవీ మాజీ అధికారులను అక్కడి ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేసింది. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జయ్ శంకర్ చొరవతో ఆ పని సాధ్యమైంది.
ఎనిమిది మంది విడుదల – వెంటనే స్వదేశానికి…
ఎనిమిది మంది నేవీ వెటరన్స్ ను ఖతార్ ప్రభుత్వం అకస్మాత్తుగా విడుదల చేసింది. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే రాత్రి పూట జైలర్ వారి దగ్గరకు వచ్చి ఉదయం తొమ్మిది కల్లా సామాన్లు సర్దుకుని రెడీగా ఉండాలని ఆదేశించి వెళ్లిపోయారు. చెప్పిన సమయానికి వారిని భారత రాయబార కార్యాలయంలో వదిలేశారు. అక్కడ నుంచి కాసేపటికే ఏడుగురిని విమానాశ్రయానికి తీసుకెళ్లి ఇండిగో ఫ్లైట్ లో ఎక్కించేసి ఢిల్లీ తీసుకొచ్చారు. మరో వ్యక్తి కాస్త ఆలస్యంగా బయలుదేరారు. ఇంతకాలం ఉత్కంఠకు గురైన వారి కుటుంబ సభ్యులు, దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మరణశిక్ష విధించిన ఖతార్ ప్రభుత్వం
ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులు ఖతార్ లోని దాహ్రా గ్లోబల్ అనే కంపెనీలో పనిచేస్తున్నారు. ఖతార్ నేవీ అధికారులకు, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు ఆ కంపెనీ పనిచేస్తుంది. ఒక రోజు హఠాత్తుగా ఖతార్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. శత్రు దేశాలకు గూఢచర్యం వహిస్తున్నారంటూ అభియోగాలు మోపగా కోర్టు మరణశిక్ష విధించింది. తర్వాత మరణశిక్షను రద్దు చేసి యావజ్జీవ ఖైదుగా మార్చేశారు. దాన్ని కూడా రద్దు చేయాలని, వాళ్లు ఎలాంటి గూఢచర్యానికి పాల్పడలేదని భారత ప్రభుత్వం దౌత్య స్థాయిలో లాబీయింగ్ చేసింది..
చొరవ చూపిన ప్రధాని మోదీ…
డిసెంబర్ నెల దుబాయ్ లో జరిగిన కాప్28 సదస్సు సందర్భంగా ఖతార్ అమీర్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలుసుకున్నారు. అప్పుడు ఎనిమిది మంది నేవీ వెటరన్స్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఒకటి రెండు రోజులకే వారి మరణశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చారు. తర్వాత విదేశాంగ శాఖ నేరుగా రంగంలోకి దిగి.. ఎనిమిది తరపున వాదించింది. వారి నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలను ఖతార్ ప్రభుత్వానికి సమర్పించింది. ఇదంతా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా, ద్వైపాక్షిక సంబంధాలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకుంటూ జరిగిన పని. నేవీ వెటరన్స్ నిందితులు కాదని ఖతార్ ప్రభుత్వం కూడా గుర్తించినందునే వారి విడుదలకు మార్గం సుగమమైంది. కేసు నుంచి బయటపడి ఆ ఎనిమిది మంది స్వదేశానికి చేరుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర కృషి చేశారని కేంద్ర విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు.ఈ నేపథ్యంలోనే బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఖతార్లో పర్యటించనున్నట్లు వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనున్నట్లు వివరించారు. స్వదేశానికి చేరుకున్న ఆ ఎనిమిది మంది కూడా భారత ప్రధానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు…