బెంగాల్ లో మమత బెనర్జీ పాలన గాడితప్పుతోంది. రౌడీ మూకలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి. ఎక్కడిక్కడ దోపిడీ గుంపులు స్వైరవిహారం చేస్తున్నాయి. హత్యలు,దోపిడీలు, మానభంగాలు నిత్యకృత్యమవుతున్నాయి. అడిగేవారే లేరన్నట్లుగా తృణమూల్ గూండాలు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీలో ఓల్డ్ వర్సెస్ యూత్ ఒక సంఘర్షణ కొనసాగుతుండగానే రెండు వర్గాలు జనం మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. సందేశ్ ఖళీలో ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. రాజకీయ గూండాల ధాటికి భయపడి అక్కడి జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు…
గూండాలపై తిరగబడిన జనం
ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఉండే సందేశ్ ఖళీ అనే పేద ప్రాంతంలో విచిత్ర పరిస్థితి నెలకొంది.అక్కడి జనంలో తృణమూల్ పార్టీ నేతలు వెట్టిచాకిరి చేయించుకుంటూ వేతనాలు చెల్లించడం లేదు. చూసి చూసి జనం తిరిగబడ్డారు. గత వారం పెద్ద ఘర్షణే జరిగింది. పేదల భూములు లాక్కుని వారితోనే చాకిరి చేయించుకుంటున్న వారితో ఘర్షణ పడ్డారు. ఘెరావ్ చేశారు..
పేదలపై దాడులు,మానభంగాలు..
వేతనాలు అడిగిన పేదలపై తృణమూల్ నేతలు దాడులు చేయించారు. పోలీసులతో కొట్టించారు. కొందరు మహిళలపై అత్యాచారాలు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చారు. ఈ లోపు పోలీసులు ఓవరాక్షన్ చేయడంతో కొందరు వెళ్లి స్థానిక ఠానాపై దాడి చేశారు. పోలీసులను అడ్డుకున్నారు. దానితో భారీ స్థాయిలో లాఠీ ఛార్జీలు జరిగాయి. జనంపై పడి దోచుకునే వారిలో షాజాన్ షేక్ అనే స్థానిక నాయకుడు కూడా ఉన్నారు. బెంగాల్ రేషన్ స్కాముకు సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలకు వస్తే జనంతో వారిని కొట్టించిన ఘనుడు షాజాన్ షేక్. ఈ గొడవలు జరిగిన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. మరో ముగ్గురు నేతలపై అత్యాచారం, హత్యాప్రయత్నం ఆరోపణలు రావడంతో వారిపై కేసులు పెట్టించి మమత ప్రభుత్వం చేతులు దులుపుకుంది.
ఆ ప్రాంతాన్ని సందర్శించిన గవర్నర్
పరిస్థితి చేయిదాటుతోందని, పేద ప్రజలు ప్రాణభయంతో బతుకుతున్నారని తెలుసుకున్న బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్.. సందేశ్ ఖళీలో పర్యటించారు. కేరళలో ఉన్న ఆయన తన దక్షిణాది పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని అక్కడకు చేరుకున్నారు. అక్కడున్న ప్రతీ మహిళ గవర్నర్ ను చూసి భోరున విలపించారు. పోలీసుల దెబ్బకు తమ ఇంటిలోని పురుషులు పారిపోయారని చెప్పుకున్నారు. కొందరు గవర్నర్ కాళ్లమీద పడిపోయి తమను కాపాడాలని వేడుకున్నారు.కొందరు గవర్నర్ బోస్ కు రాఖీ కట్టి…సొంత సోదరిగా భావిస్తూ కాపాడాలని అభ్యర్థించారు. ఒక పక్క తృణమూల్ గూండాలు, మరో పక్క పోలీసులు తమను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. కనీసం పేరు చెప్పుకునేందుకు చాలా మంది మహిళలు భయపడ్డారు. తమ పేర్లు తెలిస్తే తర్వాత పోలీసులు వచ్చి తమను, తమ ఇంట్లోని పురుషులను అరెస్టు చేస్తారని వాళ్లు భయపడుతున్నారు. మహిళల ఆవేదన చూసి చలించిపోయిన గవర్నర్… త్వరలో కేంద్రానికి నివేదిక పంపుతానని ప్రకటించారు. సందేశ్ ఖళీలో మమత గూండాలు చేసే అరాచకాలు బయట ప్రపంచానికి తెలియకుండా తృణమూల్ కాంగ్రెస్ అడ్డుపడుతోంది….