భారతరత్న పీవీ : కాంగ్రెస్ అవమానిస్తే బీజేపీ గౌరవించింది !

భారతరత్న పీవీ నరసింహారావు పక్కా కాంగ్రెస్ వాది. అయినా చివరి రోజుల్లో ఆయనను కాంగ్రెస్ అవమానించింది. పోటీ చేయడానికి చాన్సివ్వలేదు. చనిపోయిన తరవతా ఢిల్లీలో అంత్యక్రియలు చేయనిన్వలేదు. ఆయనను ఎప్పుడూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయలేదు. దీనికి కారణం గాంధీ కుటుంబానికి మించి ఆయనకు పేరు వస్తుందనే.

పీవీ అంటే కాంగ్రెస్‌కు ఎందుకు పడదు ?

పీవీ నరసింహారావు కాంగ్రెస్ నేత. కానీ విచిత్రంగా ఆయనను బీజేపీ గౌరవిస్తుంది. కానీ కాంగ్రెస్ మాత్రం అంతగా ఓన్ చేసుకోదు. దీని వెనుక ఎవరికీ తెలియని అనేక నిజాలు ఉన్నాయి. పీవీ నరసింహారావు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా కూడా చేశారు కానీ పూర్తి కాలం పదవిలో ఉండలేకపోయారు. కానీ ఢిల్లీ రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు. ఇందిరా గాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీతోనూ సన్నిహితంగా ఉన్నారు. అయితే 1990లో పీవీ నరసింహారావు రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు. కానీ రాజ్యసభ సీటు ఇవ్వడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నిరాకరించారు. దీంతో ఆయన ఆవేదనకు గురయ్యారు. ఓ దశలో ఆయన సన్యాసం పుచ్చుకుని కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకోవాలనుకున్నారు.

రాజీవ్ గాంధీ తర్వాత గాంధీ కుటుంబానికి ఆయనే దిక్కు

అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచరంలో 1991 మేలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించింది. విజయం సాధిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడే ప్రధాని అవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన మంత్రి పదవికి కాంగ్రెస్ నేతలు పోటీ పడడం సహజమే. ఈ రేసులో అప్పటి కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్ , ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్‌డి తివారీ, అర్జున్ సింగ్, మాధవరావ్ సింధియాల పేర్లు ఉన్నాయనే చర్చ జరిగింది. రాజీవ్ గాంధీ ఆప్త మిత్రుడు సతీష్ శర్మ పీవీ పేరును సోనియాకు రికమెండ్ చేశారు. గాంధీ కుటుంబంపై ఎన్నడూ తిరుగుబాటు వైఖరిని ప్రదర్శించని.. గొప్ప విశ్వాసపాత్ర వైఖరి కారణంగా కాంగ్రెస్ లోని నాటి సీనియర్ నేతలు అందరూ పీవీ పేరును సమర్ధించారు. 1991 మే 29న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. దీనిలో PV నరసింహారావు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి వరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాత సమస్యలు ప్రారంభమయ్యాయి.

సోనియా కోసం మెల్లగా పీవీకి అవమానాలు

పానా వ్యవహారాల్లో జోక్యంతో నెహ్రూ-గాంధీ కుటుంబంతో పడకపోవడంతో ఆయనను మెల్లగా అవమానించడం ప్రారంభించారు. పీవీ కేంద్రంగా చాలా రాజకీయాలు జరిగాయని కూడా ప్రచారం ఉంది. ప్రధాన మంత్రిగా ఆయన పట్టు సాధిస్తూ ఉండడంతో పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు సోనియా చుట్టూ చేరి, ఆమెకు- పీవీకి మధ్య దూరం పెంచగలిగారని చెబుతారు. . ఆ సందర్భంగా అర్జున్ సింగ్, ఎన్‌డీ తివారీ వంటి వారు పీవీపై తిరుగుబాటు చేసి మరో కాంగ్రెస్ (తివారీ)ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత పీవీని అధ్యక్ష పదవి నుంచి తొలగించి.. సీతారాం కేసరిని పదవిలో కూర్చోబెట్టారు. తర్వాత ఆయనతోనూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి, సోనియా గాంధీకి పార్టీ నాయ కత్వం అప్పచెప్పారు. శరద్ పవార్, అర్జున్ సింగ్ లాగా పీవీకి ప్రత్యేకమైన వర్గంలేదు. అసలు విషాదమంతా ఆయన రాజీనామా చేసిన తరువాత ఆయన పట్ల వ్యవహరించిన తీరులోనే ఉందని పీవీ అభిమానులు అంటారు. సోనియా, కాంగ్రెస్ పార్టీల వ్యవహారశైలి సరిగ్గా లేదని చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని అవమానపరిచారని అంటారు.