బీజేపీ వైపుకు తమిళ నేతలు

బీజేపీ ఉత్తరాది పార్టీ అని వాదించే వారికి తిరుగులేని ఎదురు సమాధానాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. దక్షిణాదిపై దండయాత్ర మొదలైనట్లేనని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కర్ణాటకలోని 28 లోక్ సభా స్థానాల్లో కనీసం 25 బీజేపీ నేతృత్వ ఎన్డీయేకు వస్తాయని ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకటించింది. తెలంగాణలో బీజేపీకి మూడు లోక్ సభా స్థానాలు వస్తాయని తేల్చింది. ఏపీలో పొత్తు పొడిచే టైమ్ వచ్చింది. కేరళలో కూడా కమలం పార్టీకి ప్రజాదరణ పెరుగుతోంది….

కమలంలో చేరిన 15 మంది మాజీలు

తమిళనాడు పరిణామాలు చకచకా మారుతున్నాయి. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు అన్నాడీఎంకే పెద్దలు ప్రకటించడం ఆ పార్టీ నేతలకు ఏ మాత్రం రుచించలేదు. మోదీ సహా బీజేపీ పెద్దలంతా ఉదారంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఎడపాటి పళణిస్వామి బృందం ఓవరాక్షన్ చేస్తోందన్న ఫీలింగు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కాలం చెల్లిన పార్టీలో ఉండే కంటే జాతీయస్థాయిలో సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై దృష్టిపెట్టిన బీజేపీలో ఉండటమే మంచిదన్న అభిప్రాయం అన్నాడీఎంకే నేతల్లో కలుగుతోంది.దానితో వారంతా ఇప్పుడు చెన్నైలోని బీజేపీ రాష్ట్ర శాఖ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. తాజాగా 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎంపీ ఒకుమ్మడిగా బీజేపీలో చేరారు. కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, ఎల్ మురుగన్ తో పాటు బీజేపీ తమిళనాడు శాఖాధ్యక్షుడు అన్నామలై సమక్షంలో వారు కమలతీర్థం పుచ్చుకున్నారు…

డీఎంకే పట్ల తీవ్ర వ్యతిరేకత

సాధారణంగా ఇప్పటివరకు ఒక ద్రవిడ పార్టీలో ఇమడలేని వాళ్లు మరో ద్రవిడ పార్టీలోకి వెళ్లిపోవడం ఆనవాయితీగా వస్తోంది. అన్నాడీఎంకేలో ఉండలేకపోతే డీఎంకేలో చేరడం పరిపాటి. ఇప్పుడు మాత్రం పద్ధతి మారింది. అధికార డీఎంకే పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన అన్నాడీఎంకే అసంతృప్తిపరులు పురోగామి ఆలోచనా విధానంతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ వైపుకు వస్తున్నారు. దాని వల్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు, క్షేత్రస్తాయిలో పనిచేసిన వాళ్లు బీజేపీకి దొరుకుతున్నారు. త్వరలో తమిళనాడు బీజేపీ పరమవుతుందని పార్టీలో చేరిన వాళ్లు చెబుతున్నారు. అంత భారీ స్థాయిలో తమిళ నేతలు బీజేపీలో చేరడం మోదీ పాపులారిటీకి నిదర్శనమని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.

2026 ఎన్నికలే టార్గెట్…

లోక్ సభ ఎన్నికల్లో తమిళనాట బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. బీజేపీ లక్ష్యం కూడా ఇప్పటికిప్పుడే ఏదో చేసెయ్యాలన్నది కాదు. 2026లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అప్పటికి పార్టీని బలోపేతం చేయగలిగితే అధికార పీఠం వైపుకు అడుగులు వేసే అవకాశం ఉంటుందని పార్టీ అగ్రనాయకత్వం అంచనా వేసుకుంటోంది. అప్పటికల్లా డీఎంకే పట్ల తమిళ జనం పూర్తిగా విసిగివేసారి పోతారని రాజకీయ ప్రత్యామ్నాయం కోసం బీజేపీ వైపుకు చూస్తారని భావిస్తున్నారు. ఎందుకంటే అన్నాడీఎంకే పూర్తిగా పాతాళానికి చేరుకుంటుంది కదా..