పరమేశ్వరుడిని పూజించే ప్రతి ఒక్కరు నొసటన భస్మం ధరిస్తారు. నుదిటిపైనే కాదు…కంఠానికి, చేతులకు, గుండెపైనా కూడా కొందరు పూసుకుంటారు. మరి భస్మధారణ ఎందుకో తెలుసా!
భస్మం మూడు రకాలు
- లౌకికాగ్ని
- వైదికాగ్ని
- శివాగ్ని
ఈ మూడు భస్మాలను వాటిని ధరించే అర్హతలు ప్రకారంగా ధరిస్తారు. అయితే సాధారణంగా నొసటన ధరించడానికి ఎటువంటి భస్మం శ్రేష్టం అనే సందేహం అందరికీ కలుగుతుంది. అందరూ ధరించడానికి గోమయం అంటే ఆవు పేడతో చేసిన పిడకల ద్వారా చేసే హోమాగ్ని నుంచి లభించే భస్మం అత్యుత్తమమైనది.
భస్మాన్ని ధరించేటప్పుడు పఠించాల్సిన మంత్రం
“ఈశానతే తత్పురుష నమో
ఘోరయతే సదా వామదేవ
నమస్తుభ్యం సద్యోజాతాయ వై నమః”
భస్మం అంటే కాలిన బూడిద కాదు
చాలామంది భస్మం అంటే కాలిన బూడిద అని అనుకుంటారు. కానీ విశిష్టమైన అర్థం ఉంది.. భస్మం అంటే ఐశ్వర్యం, భస్మం అంటే తేజస్సు. అందుకే భస్మాన్ని ధరించడానికి కూడా ఒక నియమం ఉంది. భస్మాన్ని ఎప్పుడూ త్రిపుండ్రాలుగా ధరించాలి. అంటే మూడు అడ్డు వరుసలుగా ధరించాలన్నమాట. ఇలా ధరించడంలో కూడా ఒక్కొక్కరికి ఒకో పద్ధతి ఉంది. మగవారు కనుబొమలు దాటకుండా పెట్టుకోవాలి. ఆడవారు ముంగురులు దాటకుండా ధరించాలి.
భస్మం ధరిస్తే ఏం ఉపయోగం
భస్మాన్ని ధరించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి. భస్మాన్ని మూడు అడ్డు వరుసలుగా ధరిస్తారు అనే విషయం తెలిసిందే… దీన్నే త్రిపుండ్రం అని అంటారు. త్రిపుండ్రంలో దేవతలు కొలువై ఉంటారు. ఇందులో ఒక్కొక్క రేఖకి తొమ్మిది మంది చొప్పున మొత్తం ఇరవై ఏడు మంది దేవతలు కొలువై ఉంటారు. కేవలం నొసటన మాత్రమే కాకుండా శిరస్సు, కంఠం, రెండు భుజస్కందాలు, రెండు మోచేతులు, రెండు మణికట్లు, హృదయం, నాభి, రెండు పార్శ్వములు , వెనుక భాగం… ఇలా భస్మాన్ని శరీరంలో వివిధ ప్రాంతాల్లో ధరిస్తారు. త్రిపుండ్రంలో ఇరవై ఏడుమంది దేవతలు కొలువై ఉంటారు. ఆ ఇరవై ఏడుమంది దేవతలకు అధిదేవతలు ఉంటారు. వారిలో అశ్విని దేవతలు, శివుడు, శక్తి, రుద్రుడు, ఈశానుడు, నారదుడు, వామ, జ్యేష్ఠ, రౌద్ర సహా పదహారుమంది అధిదేవతలు ఉంటారు.