ఢిల్లీలో అధికారం చేలాయిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆఫ్) అవినీతి బాగోతాలు ఒకటొకటిగా బయట పడుతున్నాయి. ఒక్క ఢిల్లీ లిక్కర్ స్కాం మాత్రమే కాకుండా అనేక రంగాల్లో ఆప్ ప్రజాధనాన్ని దోచుకుందని తెలుస్తోంది. చివరకు సిటీ బస్సుల్లో సీసీ కెమెరాలు పెట్టిన కాంట్రాక్టులో కూడా మూటలు కట్టుకున్నారు.స్కాములు ఒకటొకటిగా బయట పడుతుంటే.. ఢిల్లీ జనమే కాదు దేశ ప్రజలు కూడా ఆప్ తీరుపై విస్తుపోతున్నారు….
బయటకు తీస్తున్న ఈడీ, సీబీఐ
ఆప్ నేతలపై సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుస దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఈడీ ఒక ఆరోపణ చేసింది. ఢిల్లీ జలమండలి (డీజేబీ) కాంట్రాక్టుల్లో భారీ అవినీతి జరిగిందని.. దాని ద్వారా వచ్చిన డబ్బును ఆప్ ఎన్నికల నిధికి జమచేశారని ఈడీ అంటోంది. మంగళవారం ఢిల్లీలో పాటు వారణాసి, చండీఘడ్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ రైడ్స్ నిర్వహించింది. దాదాపు రెండు కోట్ల అవినీతికి సంబంధించిన కీలక దస్తావేజులు స్వాధీనమయ్యాయి. నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే విదేశీ కరెన్సీని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు.
కేజ్రీవాల్ సహాయకుడి ఇంట్లో సోదాలు..
ఈడీ అనేక చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం అరవిందే కేజ్రీవాల్ వ్యక్తగత సహాయకుడు బిభావ్ కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ ఎన్ డీ గుప్తా, డీజేబీ సభ్యుడు సలభ్ కుమార్, చార్టెర్డ్ అకౌంటెంట్ పంకజ్ మంగళ్ నివాసాల్లో సోదాలు జరిగాయి. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించగా…అనేక కీలక డాక్యుమెంట్స్ స్వాధీనమయ్యాయి. ఆప్ కు ఎన్నికల నిధులిచ్చినట్లు ఆ దస్తావేజుల్లో తేలింది. మరో పక్క డీజేబీ చీఫ్ ఇంజనీర్ అరోరా కూడా అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. అర్హత లేని ఒక కంపెనీకి రూ.38 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని ఈడీ గుర్తించింది. దీనికి సంబంధించి అరోరాను అరెస్టు చేశారు. కాంట్రాక్టర్ అనిల్ కుమార్ అగర్వాల్ ను జనవరి 31న అరెస్టు చేశారు. ఇద్దరికీ ఫిబ్రవరి 10 వరకు కోర్టు ఈడీ కస్టడీ విధించింది…
లబోదిబోమంటున్న ఆప్…
అవినీతి బాగోతాలను ఒకటొకటిగా ఈడీ బయటకు తీస్తుండటంతో ఆప్ నేతలు అల్లాడిపోతున్నారు. తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, రైడ్స్ లో ఒక సాక్ష్యం కూడా దొరకలేదని చెప్పుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ కక్షకట్టి తమను కేసుల్లో ఇరికిస్తోందని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతల్లో ఒకరు కూడా అవినీతికి పాల్పడలేదని వారి వాదన. దీనికి బీజేపీ ఇచ్చే సమాధానం ఒక్కటే. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటోంది. తప్పు చేయని వారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని బీజేపీ అంటోంది.