ఎన్డీఏలో చేరేందుకు చంద్రబాబు ఆరాటం – మూడో సారి మోదీ ప్రధాని అవుతారని గుర్తించే !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీఏలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షా , జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. అంతర్గతంగా జరిగిన చర్చల సారాంశం బయటకు రానప్పటికీ… తాను ఎన్డీఏలో చేరుతాననే ప్రతిపాదనను అమిత్ షా ముందు చంద్రబాబు పెట్టినట్లుగా తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ నిర్ణయం రెండు మూడు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

పవన్ కల్యాణ్ ద్వారా పవన్ ప్రయత్నం

పవన్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. టీడీపీని కూడా ఎన్డీఏలోకి తీసుకెళ్లాలని ఆయన పవన్ ద్వారా అనేక సార్లు ప్రయత్నించారు. చివరికి పవన్ ప్రయత్నాలు ఫలించి ఓ అడుగు ముందుకు పడినట్లుగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత పవన్ కూడా ఢిల్లీ వెళ్లి ఇతర అంశాలపై చర్చించనున్నారు. మొత్తంగా ఎన్డీఏలోకి రావడానికి గత ఏడాదిన్నరగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఎన్నికలకు ముందు ఓ కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఏపీ బీజేపీ ముఖ్య నేతలందరి స్థానాల్లో ఎంపీ సీట్లు

ఏపీ బీజేపీ ముఖ్య నేతలందరి స్థానాల్లో టీడీపీ పోటీ పెట్టకుండా మద్దతు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు, రాజమండ్రి, విజయవాడ, రాజంపేట, వైజాగ్, తిరుపతి లోక్ సభ స్థానాల్లో మద్దతు ఇస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి అన్ని చోట్లా బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఒంగోలు రాజమండ్రి నుంచి సోము వీర్రాజు, రాజంపేట నుంచి సత్యకుమార్ యాదవ్, వైజాగ్ నుంచి జీవీఎల్ నరసింహారావు, తిరుపతి రిజర్వుడు నియోజకవర్గం నుంచి రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి ఒకరు పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కీలకమైన విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి బరిలో దిగడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. వీరందరికీ టీడీపీ మద్దతిచ్చే చాన్స్ ఉంది.

హిందూపురంపైనా పట్టుబడుతున్న బీజేపీ

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం కోసం కూడా బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అక్కడ ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో బీజేపీ గెలిచిన స్థానాలు, గట్టి పోటీ ఇచ్చిన స్థానాలను దగ్గర పెట్టుకుని గెలుపు అవకాశాలపై విస్తృతంగా మేథోమథనం చేసిన తర్వాతనే బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాలపై రెండు మూడు రోజుల్లో కీలకమైన నిర్ణయం ఢిల్లీ నుంచి వెలువడే అవకాశం ఉంది. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఎన్డీఏలోకి వచ్చేందుకు ఆరాటపడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.