పవన్‌కు ప్లాన్డ్ గా ఎర్త్ – ఎంపీగా పోటీ చేయమంటున్న చంద్రబాబు ?

పవన్ ఎక్కడనుంచి పోటీ చేయబోతున్నారు ? ఏ నియోజకవర్గ అయితే ఆయనకి కి సెట్ అవుతుంది? ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చంతా దాని గురించే.. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని, అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకే తాను పోటీ చేయబోయే సెగ్మెంట్ గురించి సైలెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కానీ చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉంటే పాలన సాగదని..ఎంపీగా వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

కేంద్ర మంత్రి పదవి పేరుతో టీడీపీ ఉచ్చు

పవన్ లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారాన్ని టీడీపీ నేతలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి పవర్ షేరింగ్ ఉండాలంటూ పవన్ ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే నేతలు కూడా కొందరరు ఇదే విషయంపై మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు ప్రభుత్వం ఏర్పాటు అయితే ఎలా అనే చర్చ కూడా నడుస్తోంది. రెండు పవర్ స్టేషన్‌లు ఒకే చోట ఉండటం ప్రమాదమని టీడీపీ భావిస్తోంది. ఇలాంటి సమస్య రాకుండా పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లాలని టీడీపీ వైపు నుంచి క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది.

బీజేపీతో పొత్తు ప్రయ్తనాలు అందుకేనా ?

ఎన్డీఏలో చేరేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. దీనికి లోతైన వ్యూహం ఉంది. జనసేన ఇప్పటికే ఎన్డీఏలో ఉంది. మూడో సారి మోదీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని తేలిపోయింది. ఇలాంటి సమయంలో ఏపీ నుంచి ఓ కేంద్ర మంత్రి పదవి ఉండాలి. ఈ దఫా ఎంపీలు లేకపోవడంతో సాధ్యం కాలేదు. వచ్చే బీజేపీ ప్రభుత్వంలో ఏపీ నుంచి కేంద్రంలో మంత్రి పదవి పవన్ కే దక్కడానికి ఎక్కువ అవకాశం ఉంది. కేబినెట్ ర్యాంక్ కూడా దక్క వచ్చునని టీడీపీ మోటివేట్ చేయడానికే కూటమిలో చేరుతున్నట్లుగా అనుమానాలున్నాయి.

కాకినాడ లోక్ సభ బెటరని పవన్ కు ఊరింపు

కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి జనసేనాని పోటీ చేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉండే కాకినాడ సీటు సేఫ్టీగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉన్నట్లు అన్ని సర్వేల్లో తేలింది. కాబట్టి పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని టీడీపీ సూచిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని తేలిపోవడంతో…పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.