దళిత మంత్రిని అవమానపరిచిన డీఎంకే ఎంపీ…

సమసమాజ స్థాపన కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే పార్టీ ప్రతినిధి ఆయన. ఒకప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేశారు. నిత్యం గొప్ప నాయకుడన్న ఫీలింగ్ లో ఉంటారు. అందరినీ కసిరిపారేస్తుంటారు. ఇప్పుడు లోక్ సభలో కూడా అదే ధోరణితో ప్రవర్తించారు. చివరకు తను అభాసుపాలు కావడమే కాకుండా.. సొంత పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగాన్ని (డీఎంకే) ఇబ్బందుల్లోకి నెట్టారు. ఆయనే సీనియర్ నేత టీఆర్ బాలు..

మంత్రి పదవికి అనర్హుడివి – బాలు

లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమిళనాడుకు తుపాను సాయంపై డీఎంకే సభ్యులు ప్రస్తావించారు. తుపానుతో చెన్నై అతలాకుతలమైతే కేంద్రం పైసా సాయం చేయలేదని శ్రీపెరుంబుదూరు డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఆరోపించారు. అప్పడు తమిళనాడుకే చెందిన కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ అడ్డుతగిలి.. కేంద్రం ఏ ఏ ప్రకృతి వైపరీత్యాలకు ఎంతెంత సాయం చేసిందో చెప్పేందుకు ప్రయత్నించారు. దానితో సహనం కోల్పోయిన టీఆర్ బాలు.. ఆయనపై కేకలేశారు. ” నువ్వెందుకు అడ్డు తగులుతున్నావ్. అసలు నీకేం కావాలి. పార్లమెంటు సభ్యుడిగా ఉండేందుకు నువ్వు అనర్హుడివి. నువ్వసలు మంత్రి పదవికే పనికిరావు..” అంటూ కసురుకోవడంతో సభలో ఉన్నవారంతా అవాక్కయ్యారు. బాలు ఏమిటి ఇలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయారు. బాలు ప్రవర్తనపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది..

గట్టిగా నిలదీసిన బీజేపీ ఎంపీలు..

బాలు ప్రవర్తనపై విస్తుపోయిన బీజేపీ ఎంపీలంతా ముక్త కంఠంతో ఆయన తీరును దూయబట్టారు. తమిళనాడుకే చెందిన ఓ దళిత నాయకుడి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అర్బున్ రామ్ మేఘ్ వాల్ నిలదీశారు. అసందర్భ ప్రశ్నలు అడుగుతున్నారని గుర్తు చేయడం కూడా తప్పేనా అని వారు ఎదురు ప్రశ్నలు వేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ సహా ట్రెజరీ బెంచ్ లో ఉన్న వాళ్లంతా డిమాండ్ చేశారు. మూకుమ్మడి దాడితో బాలు ఒక్క సారిగా ఖంగుతున్నారు..

గత్యంతరం లేక సారీ చెప్పిన బాలు

తాను సరిదిద్దుకోలేని తప్పు చేశానని బాలుకు అర్థమయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. దానితో గందరగోళం మధ్యే ఆయన మొక్కుబడిగా సారీ చెప్పారు. దళిత మంత్రిని కించపరచడం తన ఉద్దేశం కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అణగారిన వర్గాలు రాజకీయాల్లో ఉండటం డీఎంకేకు ఇష్టం లేదని మంత్రి మురుగన్ మీడియాతో అన్నారు. అందుకే బాలు ఆక్షేపణీయమైన పదజాలాన్ని వాడారని మురుగన్ ఆరోపించారు. కొసమెరుపు ఏమిటంటే…. కాంగ్రెస్ పార్టీ కూడా ముందు వెనుక ఆలోచించకుండా బాలును సమర్థించింది. తనకు తెలియకుండానే తప్పులో కాలేసింది…