లోక్ సభకు పోటీ చేయండి – బతిమలాడుతున్న కాంగ్రెస్ అధిష్టానం

కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. లోక్ సభ ఎన్నికల్లో ఎలా నెగ్గుకు రావాలో అర్థం కాక ఇరకాటంలో పడి ఉంది. ప్రధాని మోదీ పాపులారిటీ అత్యున్నత స్థాయికి చేరుకుంటే.. కాంగ్రెస్ నేతల ప్రజాదరణ పాతాళానికి దిగిపోయింది. తాజా సర్వేల ప్రకారం మరో 70 రోజుల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి 370 లోక్ సభా స్థానాలు ఖచితంగా వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే పరువు కాపాడుకునేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది…

అశోక్ గెహ్లాట్ కు వర్తమానం

కాంగ్రెస్ పార్టీలో కాస్త పాపులారిటీ ఉన్న నేతలందరినీ లోక్ సభకు పోటీ చేయించాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కు వర్తమానం పంపారు. 2019 ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వాళ్లు ఈ దిశగా ఆలోచిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 52 స్థానాల వచ్చాయి. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్ గఢ్, హరియాణా,హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో 184 చోట్ల పోటీ చేస్తే కేవలం 12 నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలవడం జీర్ణించుకోలేని ఫలితంగానే చెప్పుకోవాలి. దానితో ఈ సారి రూటు మార్చి.. ప్రజాదరణ ఉన్న అగ్రనేతలను లోక్ సభ బరిలోకి దించాలనుకుంటున్నారు. రాజస్థాన్ మాజీ సీఎం గెహ్లాట్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని మాజీ స్పీకర్ సీపీ జోషి ప్రకటించారు. గత ఎన్నికల్లో గెహ్లాట్ కుమారుడు వైభవ్ పోటీ చేశారు. జోధ్ పూర్ ఎన్నికల బరిలో దిగిన ఆయన 2.74 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి పార్టీ జాతకాన్ని మార్చే బాధ్యతను అశోక్ గెహ్లాట్ పై పెట్టాలని నిర్ణయించారు…

భూపేష్ భాగెల్ పైనా ఆశలు…

రాజస్థాన్ సహా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. లోక్ సభ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్నది. ఇప్పుడైనా జనాదరణ పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ భాగెల్, లోక్ సభకు పోటీ చేయాలని పార్టీ వైపు నుంచి డిమాండ్లు వస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు సాధించేందుకు ఇదొక్కటే తగిన మార్గమని, భాగెల్ పోటీ చేస్తే కేడర్లో ఆత్మవిశ్వాసం పెరిగి బాగా పనిచేస్తారని ఢిల్లీ పెద్దలు విశ్వసిస్తున్నారు.

బరిలో హిమాచల్ కేబినెట్ మంత్రులు ?

బాగా పాపులారిటీ ఉన్న నేతలను స్టార్ క్యాంపైనర్లుగా పెట్టి దేశమంతా ప్రచారం చేయించడం ఒక ఆనవాయితీ. ఇప్పుడు వారినే ఎన్నికల బరిలోకి దించితే ప్రచారానికి ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచన కూడా ఉన్నది. ఉత్తర ప్రదేశ్లో సమాజ్ వాదీ పార్టీ తరపున సీరియస్ అభ్యర్థులనే రంగంలోకి దించుతామని ప్రకటించిన అఖిలేష్ యాదవ్.. కాంగ్రెస్ కూడా అదే పని చేయాలని కోరుతున్నారు. మరో పక్క హిమాచల్ ప్రదేశ్లో కొందరు కేబినెట్ మంత్రులను లోక్ సభకు పోటీ చేయించాలనుకుంటున్నారు. వాళ్లయితే తప్పకుండా గెలుస్తారని పార్టీ అగ్రనేతలు విశ్వసిస్తున్నారు..