శ్రీరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశం నలుమూలల నుంచి శ్రీరాముడి దర్శనార్థం వెళుతున్న భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకూ ఏపీ నుంచి అయోధ్యకు చేరుకోవాలంటే రెండు ట్రైన్స్ మారాల్సి వచ్చేది..కానీ ఇకపై ఆ అవస్థలు లేకుండా గోదావరి జిల్లాల నుంచి డైరెక్ట్ ట్రైన్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ..
సామర్లకోట – అయోధ్య
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి…రాజమండ్రి , సామర్లకోట , తుని ఈ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్య గాని, కాశీ క్షేత్రానికి గాని వెళ్లాలంటే కచ్చితంగా రెండు రైళ్లు మారి వెళ్ళాల్సి వచ్చేది. రాజమండ్రి – విశాఖ- భువనేశ్వర్ – కాశీ- అయోధ్య ఇలా రెండు మూడు స్టేషన్లు మారాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక రైలు పేరుతో 07218 నెంబర్ తో ఈనెల 11న సామర్లకోట నుంచి అయోధ్య వెళ్లే రైలు ఏర్పాటు చేసింది. సామర్లకోట తుని అనకాపల్లి విశాఖపట్నం మీదగా ప్రయాణమై ఈ రైలు అయోధ్యకు చేరుకుంటుంది. తిరిగి 14వ తేదీన అయోధ్యలో ప్రారంభమై సామర్లకోట వరకు ఈ రైలు తిరుగు ప్రయాణం చేస్తుంది.
గుంటూరు నుంచి మరో రైలు
గుంటూరు నుంచి మరో రైలు ప్రారంభమై రాజమండ్రి సామర్లకోట తుని అనకాపల్లి మీదగా ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఈనెల 7వ తేదీన గుంటూరులో ప్రారంభమై అయోధ్యకు ఈ రైలు ప్రయాణమై తిరిగి మరల అయోధ్యలో 10వ తేదీన ప్రారంభమై తిరిగి గుంటూరుకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ రెండు రైళ్లు వివరాలు ప్రత్యేక బోర్డులు సైతం అయ్యే రైల్వేస్టేషన్లో రైల్వే శాఖ ఏర్పాటు చేసింది.
సికింద్రాబాద్
మరోవైపు సికింద్రాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు ఏర్పాటు చేసిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్రవరి 5న అయోధ్యకు బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలులో 1346 మంది ప్రయాణిస్తున్నారు. భక్తుల శ్రీరామ నామస్మరణతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణమంతా మార్మోగింది. అయోధ్య దర్శనం తర్వాత తిరిగి ఈ ట్రైన్ 9వ తారీకున సికింద్రబాద్‌కు రానున్నట్లు రైల్వే అధికారులు తాజాగా వెల్లడించారు.
దాదాపు రెండు నుంచి మూడు రైళ్లు మారి వెళ్ళవలసిన పనిలేకుండా నేరుగా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండడం చాలా సంతోషమని ప్రయాణికులు అంటున్నారు. అందులోను సామాన్య రైల్వేస్టేషన్ లో సైతం ఈ రైలు ఆగడంతో పెద్ద ఎత్తున రామ దర్శనం చేసుకునేందుకు భక్తులు రిజర్వేషన్లు సాధారణ భోగిల్లో సైతం ప్రయాణాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో అయోధ్యకు నేరుగా చేరుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వస్తాయేమో చూడాలి..