తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తనకు తాను ఫైర్ బ్రాండ్ అని చెప్పుకుంటారు. ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో నోరు జారి తంటాలు తెచ్చుకుంటారు. అభాసుపాలవుతారు.ఐనా పద్ధతి మార్చుకోకుండా అదే ధోరణిని పాటిస్తుంటారు. బీజేపీని తన ప్రధాన ప్రత్యర్థిగా భావించే బెంగాల్ సీఎం, తరచూ లక్షణరేఖ దాటి తన నైజాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ సారి కూడా అదే జరిగిందనుకోవాలి…
మమత ఫోటోకు తేనె తినిపించిన బీజేపీ నేతలు
బెంగాల్ లో ఇప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు పూర్తిగా మరుగునపడి పోయిన మాట వాస్తవం. వాళ్లు లేచి నిలబడే అవకాశాలు కూడా కనిపించడం లేదు. పోటీ మొత్తం తృణమూల్ కు , బీజేపీకి మధ్యే నడుస్తోంది. దానితో వాతావరణం వేడెక్కుతున్న మాట కూడా వాస్తవం. ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ప్రధాని మోదీ పట్ల కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మోదీని తిట్టిపోశారు. తన అసహనాన్ని మాటల్లో ప్రదర్శించారు. దీనితో బీజేపీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు సైతం ఆమెను అసహ్యించుకుంటున్నారు. ఆమె పట్ల వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మమతకు మంచి బుద్ధి రావాలని, ఆమె నోటి వెంట తేనె పలుకులు జాలువారాలని ఆకాంక్షిస్తూ బెంగాల్ బీజేపీ శ్రేణులు… మమత ఫోటోకు తేనె తినిపించే ప్రయత్నం చేశారు. ఇకనైనా ఆమె బూతులు లేని మృదుమధురమైన భాష మాట్లాడాలని వాళ్లు హితవు పలికారు.
బెంగాలీ భాష గొప్పదనం తెలీదా…
కోల్ కతా సహా అనేక చోట్ల మమత తీరుకు వ్యతిరేకంగా బీజేపీ యువజన విభాగం ర్యాలీలు నిర్వహించింది. ర్యాలీలో ప్రముఖ విద్యావేత్త, వైతాళికుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రాసిన బర్నాపరిచయ్ పుసక్తాన్ని పట్టుకుని నడిచారు. బెంగాలీ భాష మాధుర్యం, తీయ్యదనం గురించి ఆ పుస్తకంలో రాసి ఉంది. బెంగాల్ సంస్కృతీ, సంప్రదాయాలను మమతా బెనర్జీ మంట గలిపారని బీజేపీ యువజన విభాగం ఆరోపిస్తోంది. ఇటీవల కోల్ కతాలో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ ర్యాలీలో ఉపాధి హామీ పథకానికి కేంద్ర నిధులుపై మమత మాట్లాడారు. కేంద్రం కొర్రీలు పెడుతోందని దీనికి ప్రధాని మోదీ కక్షసాధింపే కారణమని ఆరోపిస్తూ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనితో బీజేపీ నేతలు నిరసనలకు దిగారు.
ఎదురుదాడికి తృణమూల్ ప్రయత్నం
బీజేపీ వాళ్లు మమత ఫోటోను తేనే రాస్తుంటే.. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తృణమూల్ ప్రయత్నిస్తోంది. సువేందు అధికారి సహా పలువురు బీజేపీ నేతలు ఉచ్చనీచాలు తెలియకుండా, తిట్టిన తిట్టు తిట్టకుండా మమతను దూషించారని చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మాటలు విన్నారో మాత్రం వెల్లడించలేదు. దానితో తృణమూల్ కాంగ్రెస్ పార్టీవి ఒట్టిమాటలేనని తెలిపోయింది. పరువు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అర్థమైపోయింది.