అసమాన నాయకుడు అడ్వాణీకి భారతరత్న

రాజకీయ దురంధరుడు, ప్రజాక్షేత్రంలో మచ్చలేని నాయకుడు లాల్ కిషన్ అడ్వాణీ(ఎల్.కే.అడ్వాణీ) దేశ అత్యున్నత పురస్కామైన భారతరత్న అందుకోబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎక్స్ వేదికగా (ట్విటర్) ప్రధాని ఈ విషయాన్ని ప్రకటించారు.

మోదీ ఎమన్నారంటే…..

‘‘అడ్వాణీజీని భారతరత్న పురస్కారంతో గౌరవించబోతున్నాము. ఆయనతో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపాను. ప్రస్తుత తరంలో అత్యంత రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేము. క్షేత్రస్థాయి నుంచి జీవితాన్న ప్రారంభించి.. ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారు. పార్లమెంటర్‌లో ఆయన అనుభవం మనకు ఎన్నటికీ ఆదర్శప్రాయం. అడ్వాణీజీ సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా ఆయన అసమాన కృషి చేశారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం, ఆయన నుంచి అనేక విషయాలు నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తా’’ అని ప్రధాని ఎక్స్ లో రాసుకొచ్చారు.

ఉపప్రధానిగా లోహ్ పరుష్…

భారత రాజకీయాల్లో,ప్రజాజీవితంలో, ప్రజాసేవలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నాయకుల్లో అడ్వాణీ ఒకరు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి దేశ ఉప ప్రధాని వరకు ఆయన ఎన్నో పదవులను అలంకరించారు. మాజీ ప్రధాని వాజ్ పేయిని, ఆయన్ను కలిపి జంట కవులుగా పరిగణించేవారు. వాజ్ పేయిని వికాస్ పురుష్ అని, అడ్వాణీని లోహ పురుష్ అని పిలుస్తారు. కేంద్ర హోం మంత్రిగా ఆయన సేవలు అనన్యసామాన్యమనే చెప్పాలి. 1990లో తమిళనాడులోని కోయంబత్తురు పర్యటన సందర్భంగా అడ్వాణీ లక్ష్యంగానే ఉగ్రవాదులు వరుసపేలుళ్లు జరిపారు. ఐనా సరే అడ్వాణీ ఎప్పుడు జంక లేదు. భయమన్నది ఎరుగని బహుకొద్ది మంది నాయకుల్లో ఆయన కూడా ఒకరు..

రామాలయ ఉద్యమమే ఊపిరిగా…

అడ్వాణీ ప్రస్తుత పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతంలో 1927లో జన్మించారు. కరాచీ, హైదరాబాద్(పాకిస్థాన్) నగరాల్లో విద్యసభ్యశించారు. ఆర్ఎస్సెస్ భావజాలానికి, సేవాభావానికి అంకితమైన అడ్వాణీ..ఇంజనీరింగ్ విద్యను మధ్యలో మానేసి దేశానికి అంకితమయ్యాయి. దేశ విభజన తర్వాత ఇండియా వచ్చేశారు.శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జన సంఘ్ లో చేరి క్రియాశీల పాత్ర పోషించారు. ఎమర్జెన్సీ కాలంలో మీసా చట్టం కింద అరెస్టయ్యారు.జైలు నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977 మురార్జీ దేశాయ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 1980వ సంవత్సరం బీజేపీని స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీని రెండు లోక్ సభ స్థానాల నుంచి 1989లో 86కు పెంచడంతో ఆయన శ్రమ దాగొందని చెప్పక తప్పదు. అయోధ్య రామాలయం కోసం సోమ్ నాథ్ నుంచి రథయాత్ర చేసి జనంలో ఉద్యమాన్ని తీసుకొచ్చారు. 1992 డిసెంబరు 6న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చినప్పుడు అరెస్టయినప్పటికీ ఆయనలోని పట్టుదల ఏ మాత్రం తగ్గలేదు. 2002లో ఉప ప్రధానిగా నియమితులైన అడ్వాణీని 2007లో ప్రధాని అభ్యర్థిగా నియమించడం విశేషం. సరిగ్గా అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట జరిగిన కొద్ది రోజులకే ఆయన భారత రత్న పురస్కారం లభించడం అడ్వాణీ సేవలకు గుర్తింపేనని చెప్పక తప్పదు.