ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రాములవారి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంతో శ్రీ రాముడు పోటీ పడేట్టే కనిపిస్తున్నాడు. విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు నుంచి పది రోజుల్లో వచ్చిన ఆదాయం వివరాలివే…
అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన జరిగి 11 రోజులు పూర్తైంది. సంప్రోక్షణ కార్యక్రమం నుంచి ఫిబ్రవరి 1 తేదీ వరకూ దాదాపు 25 లక్షల మంది భక్తులు రామజన్మభూమిని దర్శించుకున్నారు. 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు 25 లక్షల మంది భక్తులు రామచంద్రుడిని దర్శించుకున్నట్లు అయోధ్య రామ జన్మ భూమి ట్రస్ట్ తెలిపింది. ఆలయానికి ఇప్పటివరకు రూ.11 కోట్లకుపైగా విరాళాలు సమకూరాయని ట్రస్ట్ వెల్లడించింది. హుండీల్లో రూ.8 కోట్లు, చెక్కులు, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా రూ.3 కోట్ల 50 లక్షలు విరాళాలు వచ్చాయన్నారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులు కానుకలు ఇచ్చేందుకు 4 హుండీలను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా డిజిటల్ విరాళాలు అందించేందుకు 10 కంప్యూటరైజ్డ్ కౌంటర్లు ఉన్నాయి. చెక్కులు, ఇతర ఆన్లైన్ చెల్లింపు పద్ధతుల ద్వారా కానుకలు సమర్పించవచ్చు. 11 మంది బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఆలయ ట్రస్టు సిబ్బందితో సహా 14 మంది హుండీ కానుకలు లెక్కించారు. ఈ ప్రక్రియ పటిష్ట భద్రత మధ్య జరిగింది.
చలిగాలులు తగ్గడంతో అయోధ్యకు రాబోయే భక్తుల సంఖ్య మరింతగా ఉంటుందని తద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ మేరకు స్వామి దర్శన సమయాన్ని ఆలయ నిర్వాహకులు ఇటీవల పొడిగించారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు, మధ్యలో 2గంటల విరామంతో ఆలయవేళలు ఉండేవి.
అయోధ్య రామమందిరం ఆవరణలో దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వేసిన బిజోలియా రాళ్లపై వాతావరణం ఎలా ఉన్నా భక్తులు హాయిగా నడవగలుగుతారని నిపుణులు పేర్కొన్నారు. ఈ ప్రాంతం పరిక్రమ ప్రాంతం, కుబేర్ తిలాను కవర్ చేస్తుంది. రామ్ లల్లా దర్శనం కోసం ప్రతిరోజూ 2 లక్షల మందికి పైగా భక్తులు రామ మందిరానికి వస్తున్నారని గుప్తా తెలిపారు. “రాజస్థాన్ లోని ఈ బిజోలియా రాయి దాని నాణ్యతలో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది వేసవిలో చాలా వేడిగా లేదా శీతాకాలంలో చాలా చల్లగా ఉండదు. ఈ రాయి సుమారు 1,000 సంవత్సరాల వరకు క్షీణించదు. ఇందులోని నీటిని గ్రహించే సామర్థ్యం ఇతర రాళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది” అని రాతి నిపుణురాలు దీక్షా జైన్ చెప్పారు.