మహారాష్ట్రలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఒక పక్క ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి కట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే… మరో పక్క అగ్రనాయకత్వంపై విశ్వాసం లేక ఒక్కొక్కరుగా పార్టీ నేతలు జారుకుంటున్నారు. మునిగిపోయే నావలో మేము ప్రయాణం చేయము బాబోయ్ అని వేరే దారి చూసుకుంటున్నారు. మహారాష్ట్రలో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిస్తోంది.

ఎన్సీపీ వైపుకు బాబా సిద్ధిఖీ

మహారాష్ట్రలో ఇప్పటికే విపక్ష పార్టీలు ముక్కలయ్యాయి. శివసేన చీలికవర్గం నేత ఏక్ నాథ్ షిండే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. శరద్ పవార్ నేతృత్వ ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ ఎన్డీయేలో భాగస్వామిగా డిప్యూటీ సీఎం పదవిని చేపట్టారు. కాంగ్రెస్ లో చీలిక కనిపించకపోయినా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కూడా వేరు దారి వెదుక్కున్నారు. ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరేందుకు సిద్ధమై డిప్యూటీ సీఎంను కలిశారు. అప్పుడు ఎమ్మెల్యే అయిన ఆయన కుమారుడు జీషన్ సిద్ధిఖీ కూడా వెంట ఉన్నారు. ఇద్దరూ వచ్చే వారం లాంఛనంగా ఎన్సీపీలో చేరతారు. ముంబైకే చెందిన బాబా సిద్ధిఖీ

బాబా సిద్ధిఖీ ఎవరూ..?

ఆయన బాంద్రా పడమటి నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామంత్రిగా పనిచేశారు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ముంబై డివిజన్ చైర్మన్ గా పనిచేశారు. విద్యార్థి నాయకుడిగా ఎదిగిన బాబా సిద్ధిఖీ..తర్వాత కార్పొరేటర్ అయ్యారు. 1999, 2004,2009లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. మురికివాడల ప్రజల పునరావాస పథకంలో స్కామ్ జరిగిందంటూ కేసు నమోదైంది. దీనికి సంబంధించి మే 2017లో ఈడీ రైడ్స్ కూడా చేసింది. దానిపై విచారణ ఇంకా కొనసాగుతోంది….

కాంగ్రెస్ ను వీడిన మిలింద్ దేవరా

బాబా సిద్ధిఖీ కంటే ముందే మరో నాయకుడు మిలింద్ దేవరా కాంగ్రెస్ ను వీడారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ తో 55 ఏళ్ల బంధాన్ని వదులుకుని వెళ్తున్నానని చెప్పుకున్నారు. తన జీవితంలో ఓ అధ్యాయం ముగిసిందని సరికొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు కంకణం కట్టుకున్నానని కూడా దేవర ప్రకటించారు. పైగా మిలింద్ దేవరా అన్న ఒక మాట సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అభివృద్ధి పథంలో పయనించేందుకు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్తున్నట్లుగా చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతిబంధకమని ఆయన చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఒక రకంగా కాంగ్రెస్ పనైపోయిందని కూడా ఆయన సంకేతమిచ్చినట్లయ్యింది. మిలింద్ దేవరా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మురళీ దేవరా కుమారుడు.2004,2009లో ముంబై సౌత్ లోక్ సభా స్థానం నుంచి గెలుపొందారు. 2014,2019లో ఓటమి పాలైన తర్వాత కొన్ని రోజులు కనిపించకుండా పోయారు. ఇప్పుడు షిండే వర్గంలో చేరారు. మిలింద్ దేవరా, బాబా సిద్ధిఖీ మాత్రమే కాకుండా చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ ను వదిలి పక్కచూపులు చూస్తున్నారు…