ఏపీ ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించరా ? షర్మిల రాజకీయంపై విస్మయం

మొన్నటిదాకా ఆమె తెలంగాణ బిడ్డ. ఏపీ, తెలంగాణ మధ్య ఏదైనా వివాదం వస్తే తనది తెలంగాణ అని ఏపీపై పోరాడతానని ప్రకటించారు. జల వివాదం వచ్చినప్పుడు తెలంగాణ వైపే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏపీ కోసమే పుట్టినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ఆమె ఎవరో ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఆమె షర్మిల., కొత్త ఏపీ పీసీసీ అధ్యక్షురాలు. ఆమె తీరుపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీతో కొట్లాడతానన్న షర్మిల

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరం అయితే అన్న జగన్మోహన్ రెడ్డితో పోరాటానికైనా సిద్ధమని.. ఎక్కడా వెనక్కి తగ్గబోనని వైఎస్ షర్మిల గతంలో మీడియా ముఖంగా తేల్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావొచ్చు.. విభజన వివాదాల విషయంలో కావొచ్చు… రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సవాలక్ష వివాదాల్లో కావొచ్చు.. ఏ సందర్భంలో అయినా… తాను తెలంగాణ వైపునే ఉంటానన్నారు. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పటికీ.. ఆయనతో కొట్లాడతానని స్పష్టం చేస్తున్నారు. వై తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం ఇక్కడ ప్రజల శ్రేయస్సుకోసం .. రాజన్న బిడ్డగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నానని… చెప్పుకొచ్చారు. మరి షర్మిల ఇప్పుడేం చేస్తున్నారు.

ఏపీ ప్రజలకు కనీసం క్షమాపణలు చెప్పరా ?

తెలంగాణలో రాజకీయాలు చేసినప్పుడు ఏపీ ని కించ పరిచి ఇప్పుడు రాజకీయం కోసం.. వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పడం కనీస సంప్రదాయం. కానీ అక్కడ రాజకీయాలు చేసినప్పుడు ఏమి మాట్లాడారో పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు.. ఏమీ తెలియనట్లుగా ప్రకటనలు చేస్తూ.. ప్రజల్ని ఓ మాదిరిగా కూడా చూడని పరిస్థితికి షర్మిల వచ్చారు. ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ముందు ఏపీ ప్రజలకు షర్మిల క్షమాపణలు చెప్పాలని ఆ తర్వాతే రాజకీయాలు చేయాలని డిమండ్ చేశారు.

ప్రజలు అంత అమాయకులు కాదు – బుద్ది చెప్పరా ?

ఏపీ ప్రజల్ని ఓ మాదిరిగా కూడా చూడని షర్మిల లాంటి రాజకీయ నేతలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. తమను కించ పరిచి మళ్లీ తమతోనే రాజకీయం చేసేందుకు వచ్చిన వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. షర్మిలకు కూడా అదే గతి పట్టిస్తారు. అందుకే … గతంలో తెలంగాణలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలకు .. ఇప్పుడు బేషరతుల క్షమాపణలు చెప్పిన తర్వాతనే ఏపీలో రాజకీయాలు చేయాలన్న డిమాండ్లు సహజంగానే వినిపిస్తున్నాయి.