జార్ఖండ్ ముక్తి మోర్ఛా (జేఎంఎం) వ్యవస్థాపకుడైన శిబు సోరెన్ తనయుడు, ఇప్పటిదాకా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఏడు గంటల పాటు ఆయన్ను రాజధాని రాంచీలో ప్రశ్నించిన తర్వాత రాత్రి బాగా పొద్దుపోయాక అదుపులోకి తీసుకున్నారు. ల్యాండ్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆయన అరెస్టు అయ్యారు. అంతకు కొద్ది సేపు ముందే హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జేఎంఎం మరో నేత చంపై సోరెన్ ముఖ్యమంత్రి అవుతున్నారు..ప్రస్తుతం ఆయన రవాణా శాఖా మంత్రిగా ఉన్నారు.
సమాధానాలు దాటవేతకే సోరెన్ ప్రయత్నం…
ఏడు గంటల విచారణలో ఈడీ అధికారులు సోరెన్ కు 15 ప్రశ్నలు సంధించారు. ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా సోరెన్ దాటవేశారని ఈడీ వర్గాలు అంటున్నాయి. తొలుత జనవరి 20న సోరెన్ ను ప్రశ్నించగా తర్వాత ఆయన ఈడీ ముందు హాజరు కాలేదు. తాజాగా ఏడు గంటల విచారణ తర్వాత ఆయన స్టేట్ మెంటును టైపు చేసి చూపించారు. సంతకాలు పెట్టించుకున్నదీ లేనిది తెలియరాలేదు. లాండ్ మాఫియాతో సంబంధాల ఆధారంగా సోరెన్ అనేక స్థిరాస్తులు సంపాదించారు. ఈ క్రమంలో అనేక ఆస్తుల బదలాయింపు కూడా జరిగింది.
14 మంది అరెస్టు
ఈ కేసులకు సంబంధించి ఈడీ ఇంతవరకు 14 మందికి అరెస్టు చేసింది. అందులో 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చవీ రంజన్ కూడా ఉన్నారు. ఆయన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరక్టరుగానూ, రాంచీ డిప్యూటీ కమిషనర్ గానూ పనిచేశారు.జార్ఖండ్ భూ పరిపాలనా శాఖ ఉద్యోగి భాను ప్రసాద్ కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. డమ్మీ విక్రేతలను చూపించి భూములు కొనుగోలు చేసినట్లుగా ఈడీ విచారణలో వెల్లడైంది. బోగస్ డాక్యుమెంట్లు కూడా సృష్టించారని వెల్లడైంది. కోట్లాది రూపాయల భూమిని కారుచౌకగా సొంతం చేసుకున్నారు.
కేజ్రీవాల్ కు సమన్లు
హేమంత్ సోరెన్ కేసు కొనసాగుతుండగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై లిక్కర్ స్కాం విచారణ నడుస్తోంది.కేజ్రీవాల్ కు వరుసగా ఐదో సారి సమన్లు జారీ చేశారు. ఆయన ఈడీ నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. లిక్కర్ కేసులో మొదటిసారి ఆయన నవంబర్ 2వ తేదీన సమన్లు ఇచ్చింది ఈడీ. ఆపై డిసెంబర్ 21న రెండోసారి, జనవరి 3వ తేదీన మూడోసారి, జనవరి 13వ తేదీన నాలుగోసారి సమన్లు జారీ చేసింది. అయితే పార్టీ వ్యవహారాల పేరిట ఆయన విచారణకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. తాజాగా ఐదోసారి నేడు జారీ చేసిన సమన్లలో ఫిబ్రవరి 2వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ కోరింది. ఈసారి గనుక ఆయన హాజరు కాకుంటే.. అరెస్ట్ వారెంట్ కోసం ఈడీ కోర్టును ఆశ్రయించే వీలుంది. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే జైలుకు వెళ్లాల్సిందేనని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో విపక్షాల ఆరోపణలను కేంద్రంలోని అధికార పార్టీ తిప్పికొడుతోంది….