అయోధ్య రామమందిరానికి ఇచ్చే విరాళాలపై ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80G కింద ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. ఎలా – ఏంటి అనే వివరాలు మీకోసం…
2024 జనవరి 22న అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఈ కలను సాకారం చేయడంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక పాత్ర పోషించింది. ఆలయ నిర్మాణంలో తాము భాగస్వాములు కావాలనే కోరికతో ప్రపంచం నలుమూలల నుంచి ట్రస్ట్‌కి విరాళాలు వెల్లువెత్తాయి. చాలా మంది తమ ఆర్థిక స్థోమతకు మించి కూడా విరాళాలు అందజేసి భక్తి చాటుకున్నారు. ఈ విరాళాలపై ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80G కింద ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు.
ట్యాక్స్ డిడక్షన్‌కి అర్హత పొందాలంటే విరాళం ఇలా ఉండాలి
ఆలయ పునరుద్ధరణ లేదా మరమ్మతుల లక్ష్యంతో చేసిన విరాళాలు మాత్రమే డిడక్షన్‌కి అర్హత పొందుతాయి. దర్శనం లేదా ప్రసాదం వంటి సాధారణ విరాళాలు ఈ పరిధిలోకి రావు. ట్యాక్స్ డిడక్షన్‌కి అర్హత పొందాలంటే, రూ.2,000 కంటే ఎక్కువ విరాళాలు నగదు రూపంలో చేయకూడదు. ఎందుకంటే రూ.2,000 కంటే ఎక్కువగా చేసిన క్యాష్ డొనేషన్లపై డిడక్షన్ పొందలేరు. ప్రత్యామ్నాయంగా చెక్, డీడీ, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లేదా ట్రస్ట్ అధికారిక వెబ్సైట్ ద్వారా డొనేషన్స్ ఇవ్వొచ్చు.
రిటర్న్‌లు ఇలా ఫైల్ చేయాలి
ఆదాయ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేస్తున్నప్పుడు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటేనే ఈ డిడక్షన్ వర్తిస్తుంది. పన్ను చెల్లింపుదారులు తమ ధార్మిక విరాళాల నుంచి ఎక్కువ ప్రయోజనాలు పొందాలనుకుంటే, పాత పన్ను విధానం సెలక్ట్ చేసుకోవాలి. కొత్త పన్ను విధానం, సరళమైనది అయినప్పటికీ, 80G వంటి సెక్షన్ల కింద డిడక్షన్స్ క్లెయిమ్ చేసే అవకాశం లేదు. అయోధ్య రామమందిర్ ట్రస్ట్‌కు విరాళం ఇచ్చేవారు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80G కింద డొనేషన్ మొత్తంపై 50% డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.20,000 విరాళం ఇస్తే, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి రూ.10,000 డిడక్షన్ పొందవచ్చు.
ఇవి తెలుసుకోవాలి
విరాళాలు అధికారిక మార్గాల ద్వారా ఉండాలి. డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి ట్రస్ట్ నుంచి చెల్లుబాటు అయ్యే రిసీప్ట్ అవసరం. డిడక్షన్ క్యాప్‌ను మీ అడ్జస్టెడ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో 10%గా నిర్ణయించారు. అవసరమైన డాక్యుమెంట్లు, ట్రస్ట్ పాన్, రిజిస్ట్రేషన్ వివరాలు, వ్యక్తిగత వివరాలు, అమౌంట్, తేదీ, విరాళం అందజేసిన విధానం వంటి వివరాలున్న డొనేషన్ రిసీప్ట్ అవసరం. ఇది బ్యాంక్ స్టేట్మెంట్ లేదా చెక్ కాపీ వంటి పేమెంట్ ప్రూఫ్‌గా అందజేయాలి. సంబంధిత షెడ్యూల్ ప్రకారం ITR ఫారమ్‌లో విరాళం వివరాలను అందించాలి.