వాళ్లు మారరు – పిచ్చకొట్టుడు కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాట. ఒకరు పైకి వెళ్తుంటే నలుగురు కిందకు లాగే పార్టీ అది. బొత్తిగా క్రమశిక్షణ లేని వ్యవస్థ కూడా అదే. పార్టీ క్రమశిక్షణా సంఘం నేతలే అప్పుడప్పుడు డిసిప్లీన్ కోల్పోతుంటారు. వీధిన పడి తిట్టుకుంటుంటారు.వారి తగవు తీర్చేలోపు సంవత్సరాలు పడుతుంది. ఈ లోపు కొత్త కొట్లాటలు మొదలవుతాయి….

ఇద్దరు నేతల మద్దతుదారులు

ఇద్దరు మాజీ మఖ్యమంత్రుల మద్దతుదారులు పార్టీ కార్యాలయం వేదికగా కుర్చీలు ఎత్తి కొట్టుకున్నారు.చాలా కాలం క్రితం ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, కొన్ని నెలలే ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాథ్..మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో రెండు గ్రూపులకు నాయకులుగా ఉన్నారు. వారి మద్దతుదారులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యాలయం దగ్గర తిట్టుకుంటూ కొట్టుకున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి షారయార్ ఖాన్ , రాష్ట్ర పార్టీ షెడ్యూల్డ్ కులాల విభాగం అధ్యక్షుడు ప్రదీప్ అహిర్వార్ నెట్టుకుని, ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుని కొట్టుకున్నారు. చెప్పడానికి వీలుకాని బూతులు తిట్టుకున్నారు.

దిగ్విజయ్ సింగునే తిడతావా..

మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ను ప్రదీప్ అహిర్వార్ దూషించారని ప్రధాన ఆరోపణ. మా నేతనే తిడతావా అంటూ షారయార్ ఖాన్ ఎదురు తిట్లు తిట్టడం మొదలు పెట్టారు. దానితో మాటామాటా పెరిగి చేతులకు కూడా పనేచెప్పారు. ప్రదీప్ అహిర్వార్ ను షారయార్ ఖాన్ కుర్చీలోంచి తోసేశాడు. అంతే ప్రదీప్ బూతులు అందుకున్నారు. అతి కష్టం మీద అక్కడున్న ఇతర నేతలు ఇద్దరినీ విడదీశారు…

అంతా టికెట్ల లొల్లి…

పీసీసీ కార్యాలయంలో జరిగినదీ చిన్న గొడవ లాగే అనిపించొచ్చు. ఇద్దరు కింది స్థాయి నేతలు కొట్టుకున్నట్లు కనిపించొచ్చు. కాకపోతే దాని వెనుక పెద్ద కథే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైంది. ఓటమికి కారణాలపై పార్టీలో పోస్ట్ మార్టం మొదలైంది.ఈ దిశగానే టికెట్ల బట్వాడాలో అక్రమాలతో చర్చ మొదలైంది. ఎవరెన్ని టికెట్లు అమ్ముకున్నారనే దానిపై కాంగ్రెస్ లో ఆరోపణాస్త్రాలు పెల్లుబికాయి. కమల్ నాథ్ ఎక్కువ వసూలు చేశారంటే, దిగ్విజయ్ డబ్బు సంచులు ఇంటికి పట్టుకెళ్లారని ఒకరిపై ఒకరి అనుచరులు ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయం ఢిల్లీలోని అధిష్టానం దృష్టికి కూడా వెళ్లింది. అయితే లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎవరినీ గట్టిగా నిలదీయలేని దుస్థితి. ఎవరి మీద చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది. అధిష్టానం ప్రస్తుతానికి మౌనంగా ఉంది.దాన్ని ఆసరాగా తీసుకుని ఇరు వర్గాలు వీధిన పడి కొట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ పరువు బజారుకీడ్చుతున్నాయి. తాజా ఫైట్ వెనుక అగ్రనేతల ప్రోత్సాహం ఉందా. లేక వాళ్లే కొట్టుకున్నారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది…..