జార్ఖండ్ ల్యాండ్ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ దాదాపుగా పరారీలో ఉన్నారు. ఆయన్ను ప్రశ్నించేందుకు ఢిల్లీ నివాసం చుట్టూ ఈడీ అధికారులు చక్కర్లు కొడుతున్నారు. ఖరీదైన ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. సోరెన్ ను అరెస్టు చేయోచ్చు, చేయకపోవచ్చు. అది వేరే విషయం. కాకపోతే స్కామ్ నిందితులను బుక్ చేసేందుకు వారిని చట్టం ముందుకు తీసుకువచ్చేందుకు ఈడీ అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. సరికొత్త మార్గాల్లో, దర్యాప్తు పద్ధతులు మార్చుతూ కొందరు అధికారులు, కాంట్రాక్టర్లను బుక్ చేయాల్సి వచ్చింది…
దర్యాప్తుకు అత్యంత కష్టమైన రాష్ట్రం
జార్ఖండ్ ల్యాండ్ స్కామ్ లో ముఖ్యమంత్రి సోరెన్ తో పాటు కనీసం అరడజను మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మరికొందరు కాంట్రాక్టర్లపై కేసు ఉంది. స్కామ్ జరిగిన క్షేత్రం సాహిబ్ గంజ్ రాష్ట్ర రాజధాని రాంచీకి 435 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు మార్గాన వెళితే కనీసం పన్నెండు గంటలు పడుతుంది. అక్కడి రోడ్లు అంత అధ్వాన్నంగా ఉంటాయి. 2022 జూన్లో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడికి వెళితే ఎటు వైపు నుంచి దాడి జరుగుతుందోనన్న భయం కూడా అధికారుల్లో ఉండేది. దానితో వాళ్లు మార్చారు. పశ్చిమ బెంగాల్ వైపు నుంచి వచ్చిన 90 మంది అధికారులు వేర్వేరు హోటళ్లలో బస చేశారు. తామంతా భూపరిశోధనకు వచ్చిన జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులమని చెప్పుకున్నారు. 150 మంది సీఆర్పీఎఫ్ భద్రతా సిబ్బందిని కూడా సివిల్ డ్రెస్ లో వెంట తెచ్చుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ మాఫియాకు సమాచారం అందకుండా చూసుకున్నారు…
కాన్ఫరెన్స్ పేరుతో దాడులు
మనీలాండరింగ్ వల్ల జరిగే నష్టాలు వివరించేందుకు ఒక కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు గతేడాది అన్ని పత్రికల్లో ప్రకటనలిచ్చారు. 2023 ఏప్రిల్ 13,13 తేదీల్లో ఈ సదస్సు జరగాల్సి ఉంది. రాంచీలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఈ సదస్సు జరుగుతుందని ప్రకటించారు. సిటీలో అక్కడక్కడా బ్యానర్లు కూడా కట్టారు. దానితో ఎవరూ అనుమానపడలేదు. వారిని అడ్డుకునేందుకు సోరెన్ గ్రూపు ప్రయత్నించలేదు. రాంచి వచ్చిన ఈడీ అధికారులు మైనింగ్ మాఫియాపై దాడి చేసి.. పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వచ్చి పనైపోయింది. కాన్ఫరెన్స్ మాత్రం జరగలేదు..
నిందితుడి భార్యకు దీపావళి బహుమతులు
ఈడీ అధికారులు మరో గేమ్ కూడా ఆడారు. స్కామ్ నిందితుడి భార్యకు ఫోన్ చేసి మార్కెటింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. వారికి లక్కీ డ్రాలో భారీ బహుమతులు వచ్చాయని నమ్మించారు. అది దీపావళి ఫ్రీ స్కీమ్ అని చెబుతూ దంపతులు వస్తేనే గిఫ్ట్ తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దానితో అప్పటి వరకు పరారీలో ఉన్న ఆ నిందితుడు భార్యకు వచ్చే గిఫ్ట్స్ కోసం బయట కనిపించాడు. ఈడీ అధికారులు చెప్పిన ప్రదేశానికి దంపతులు రావడంతో అతడ్ని అరెస్టు చేశారు. మరో పక్క ఈడీ అధికారులు తన భర్తను అరెస్టు చేయకుండా ఓ ఐఎఎస్ అధికారి భార్య పూజలు, హోమాలు చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణ ద్వారా ఈ విషయాలను తెలుసుకున్న ఈడీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఐఎఎస్ అధికారులు కూడా ఇలా ఉంటారని వారికి మొదటి సారి తెలిసింది…