పెరిగిన అసహనం – హనుమాన్ పతాకం తొలగింపు

కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా విద్వేషాలు, విపత్కర పరిస్థితులు సృష్టించడానికే ప్రాధాన్యమిస్తుంది. కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మైనార్టీలను మంచి చేసుకునే ఏకైక అజెండాతో హిందువులను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. హిందువులు ఎలాంటి చిన్న కార్యక్రమం పెట్టుకున్నా దానికి ఆటంకాలు కలిగిస్తూనే ఉంది..

మాండ్యాలో జెండా వివాదం

మాండ్యా జిల్లాలోని కెరగోడు గ్రామంలో 108 అడుగులు జెండా స్థంభంపై హనుమంతుడి జెండా ఏర్పాటు చేసారు. పది గ్రామాల ప్రజలు ఒకటై చర్చించిన తర్వాత గ్రామ పంచాయతీ అనుమతితోనే దాన్ని ఆవిష్కరించారు. అయితే కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు దానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. పోలీసులను ప్రయోగించింది పరిసర గ్రామాల్లో సెక్షన్ 144 విధించింది. ఉన్నతాధికారులు వచ్చి హనుమంతుడి జెండాను తొలగించారు..

ధర్నాకు దిగిన గ్రామస్థులు

ప్రభుత్వ తీరుపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. నిరసనగా వ్యాపార సంస్థలను సైతం మూసేశారు. గ్రామస్థులంతా చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న జండాను ఎలా తొలగిస్తారని వారు ప్రశ్నించారు. ఇదంతా స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ చేయిస్తున్నారని వారు ఆరోపించారు. కొందరు గ్రామస్థులు ఎమ్మెల్యే రవికుమార్ పేరున్న బ్యానర్లను చించి పడేశారు. వారికి హిందూ సంస్థల కార్యకర్తలు తోడయ్యారు. కర్ణాటకలోని అన్ని జిల్లాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు హిందూ సంస్థలు సిద్ధమవుతున్నాయి….

జాతీయ పతాకం పెడతామంటున్న కాంగ్రెస్

మాండ్యా వ్యవహారంపై కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. కాషాయ జెండా పెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. నిజానికి గ్రామస్థులే స్వయంగా నిధులు వసూలు చేసి ఏర్పాటు చేసుకున్న జెండా స్థంభం అది. అనుమతి తీసుకుని నిర్వహించిన కార్యక్రమానికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పని కూడా లేదు. అయితే సిద్దరామయ్య బుద్ధిపూర్వకంగా అడ్డదిడ్డమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. ఐనా కాంగ్రెస్ తన బుద్ధి మార్చుకోలేకపోయింది. పైగా ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. జెండా స్థంభం అలాగే ఉంటుందని చెబుతోంది. దానిపై హనుమంతుడి జెండా బదులు భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తామని సిద్దరామయ్య చెబుతున్నారు. దీనిపై హిందూత్వవాదులు కూడా అనేక ప్రశ్నలు వేస్తున్నారు. హనుమంతుడు భారతీయుడు కాదా అన్నది వారి మొదటి ప్రశ్న. హనుమంతుడి బొమ్మ ఉన్న జెండా పెడితే తప్పేమిటన్న ప్రశ్నకు వారి నుంచి సమాధానం రావడం లేదు. అదేమంటే హనుమంతుడి జెండా పెట్టుకునేందుకు మరో ప్రైవేటు స్థలంలో అనుమతిస్తామని వారు చెబుతున్నారు….