ఎంపీ టిక్కెట్లంటే పారిపోతున్నారు – వైసీపీలో ఏం జరుగుతోంది ?

వైసీపీలో టిక్కెట్లు ఇస్తామన్నా వద్దనే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చినా అవసరం లేదని తేల్చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం తరహాలోనే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కోనేటి ఆదిమూలం కూడా తనకు ఎంపీ టిక్కెట్ అవసరం లేదంటున్నారు తన నియోజకవర్గం సత్యవేడు ఎమ్మెల్యే టిక్కెట్ మాత్రమే కావాలంటున్నారు. తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తికి సత్యవేడు టిక్కెట్ ఇచ్చారు.

ఎంపీ టిక్కెట్ వద్దంటున్న నేతలు

ఎంపీగా పోటీ చేయడం కోనేటి ఆదిమూలంకు ఇష్టం లేదు. తనపై మంత్రి పెద్దిరెడ్డి భారీ కుట్ర చేశారని మండిపడ్డారు. తనను నమ్మించి నట్టేట ముంచారని, నాలాంటి వారికి మోసం చేస్తారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లు వైఎస్ఆర్సీపీ జెండా మోసి, నిరంతరం శ్రమించానని, ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించారని ఆదిమూలం కన్నీళ్లు పెట్టుకున్నారు. 1989లో స్కూటర్ మీద వచ్చే పెద్దిరెడ్డి. ఈ రోజు వేల కోట్లు సంపాదించారన్నారు. పెద్దిరెడ్డి చెప్పిందే నియోజకవర్గంలో చేశాననన్నారు. నియోజకవర్గంలో అన్ని వర్గాల సహకారం తనపై ఉందని అన్నారు. దళితుడయిన తనను అవమానపరుస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు కర్నూలు ఎంపీ టిక్కెట్ గుమ్మనూరు జయరాంకు ఇచ్చినా ఆయన వద్దంటున్నారు.

మచిలీపట్నం, నర్సరావుపేట ఎంపీలు రాజీనామా

మచిలీపట్నం, నర్సరావుపేట ఎంపీలు వైసీపీకి రాజీనామా చేశారు. వారి ప్లేస్ లో ఇతరుల్ని ఎంపిక చేయడానికి తంటాలు పడుతున్నారు. నర్సరావుపేట ఎంపీ స్థానానికి చాలా మంది పేర్లను పరిశీలించారు కానీ ఎవరూ అంగీకిరంచలేదు. చివరికి అనిల్ కుమార్ యాదవ్ వైపు మొగ్గారు. ఆయన జగన్ గీసిన గీత దాటనని ప్రకటించి.. అంగీకరించారు. అయితే ఆయన కోరిక మాత్రం నెల్లూరులో పోటీ చేయాలి ఉంది. మచిలీపట్నంకు పలువురు ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా పరిశీలించినా ఎవరూ అంగీకరించడం లేదు.

ఎంపీ సీట్లపై నమ్మకం లేదా ?

ఎంపీ సీట్లకు మంచి డిమాండ్ ఉండేది . కానీ వైసీపీలో ఎంపీ సీట్లు అంటే వద్దంటున్నారు. ఖర్చుకు భయపడి వద్దంటున్నారా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. టిక్కెట్ ల కసరత్తులో వైసీపీ అధినేత తీరిక లేకుండా ఉంటున్నారు. అయితే ఎంతో కసరత్తు చేసినా మళ్లీ మళ్లీ అభ్యర్థుల్ని మార్చాల్సి వస్తోంది.