టీడీపీ విషయంలో జరుగుతున్న పరిణామాలతో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్లాన్ బీ అమలు చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పొసగదని చివరి క్షణంలో తమకు సీట్లు కేటాయించినా అన్ని సీట్లలో అభ్యర్థుల్ని పెడతారని అనుకుంటున్న పవన్ కల్యాణ్. బీజేపీతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నేడో రేపో ఢిల్లీకి వెళ్లే్ సూచనలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు తీరుపై పవన్ లో పెరుగుతున్న అనుమానాలు
చంద్రబాబు ఓ వైపు పొత్తుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ పోతూండటంతో పవన్ అసహనానికి గురయ్యారు. తాను రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఈ క్రమంలో సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేగింది. సోషల్ మీడియా పోస్టుతో చర్యకు ప్రతి చర్య ఉంటుందని ఆయన హెచ్చరించారు. దీంతో టీడీపీ చేసే కుట్రల్ని భరిస్తూ ఉండదల్చుకోలేదని ఆయన డిసైడయినట్లుగా తెలుస్తోంది. అన్నదమ్ములిద్దరూ వ్యూహాత్మకంగానే ప్రకటనలు చేస్తున్నారని అనుకుంటున్నారు.
కీలక వ్యూహాల అమలులో జనసేన
ఏ మాత్రం తగ్గకూడదని అనుకుంటున్న జనసేన.. బీజేపీతో కలిసి వెళ్తే .. కింగ్ మేకర్ అవడం ఖాయమన్న అంచనాలో ఉన్నారు. జనసేన, బీజేపీ బాగా పుంజుకున్నాయని జమిలీ ఎన్నికలు జరుగుతూండటంతో మోదీ క్రేజ్ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున అభ్యర్థుల్ని ఇప్పటికే ఎంపిక చేసుకున్నారు. బీజేపతో చర్చలు పూర్తి కాగానే తదుపరి కార్యచరణ ప్రకటించే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీ పెద్దలతో నిరంతరం టచ్ లో పవన్ కల్యాణ్
నిజానికి పవన్ కల్యాణ్ పొత్తు విషయంలో రాష్ట్ర నేతలతో కాకుండా.. జాతీయ నేతలతో టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. అందుకే బీజేపీ నేతలు.. తాము జనసేనతో పొత్తులో ఉన్నామని అందులో మరో మాట లేదని చెబుతూ వస్తున్నారు. ఈ మాటల వెనుక అంతరార్థం మరో పది రోజుల్లో తేలిపోనుంది. దానికి తగ్గ పరిణామాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. టీడీపీ రాజకీయాలను పవన్ కల్యాణ్ ఊహించలేరని .. తట్టుకోలేరని.. బీజేపీనే సహజ భాగస్వామిగా భావిస్తారని అంటున్నారు. పది రోజుల్లో పొత్తులపై ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోనున్నాయి.