బిహార్ సీఎం నితీశ్ కుమార్ అవసరాన్ని అవకాశంగా మార్చుకునే నాయకుడు. తన అవసరాన్ని బట్టి కూటమి మారి.. అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండే రాజకీయుడు. పట్లూ రామ్ అనో, యూ టర్న్ పాలిటీషియన్ అనో ఎంతమంది విమర్శించినా ఆయన అవకాశం వచ్చినప్పుడు గోడ దూకడానికి వెనుకాడరు. ఇప్పుడాయన ఆర్జేడీతో స్నేహానికి బై బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు…
బిహార్ అధికార కూటమిలో లుకలుకలు
తూర్పు రాష్ట్రం బిహార్ అధికార కూటమిలో మళ్లీ సంక్షోభం తలెత్తింది. అటు నితీశ్ కుమార్ జేడీయూ, ఇటు లాలూ యాదవ్ ఆర్జేడీ విడిపోయేందుకే ఇష్టపడుతున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు లాలూ యాదవ్ తన పార్టీ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నుంచి నితీశ్ తమను వెళ్లగొడితే భవిష్యత్ కార్యాచరణ ఏమిటో నిర్ణయించుకునేందుకు ఆయన అందరి సలహాలు కోరుతున్నారు. ఇప్పుటికే నితీశ్ గ్రౌండ్ వర్క్ సిద్దం చేసినట్లు చెబుతున్నారు. దీనితో లాలూ కుటుంబ సభ్యులు నితీశ్ పై బహిరంగ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదే ఇప్పుడు నితీశ్ కు లాలూ గ్రూపును వెళ్లగొట్టేందుకు సదవకాశాన్నిచ్చింది.
పరిస్థితిని సమీక్షించుకుంటున్న బీజేపీ
బిహార్ పరిస్థితిని బీజేపీ సమీక్షించుకుంటోంది. మాజీ సీఎం, సోషలిస్టు నేత కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న ఇవ్వడాన్ని నితీశ్ స్వాగతించిన తీరుపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పైగా బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కూడా నితీశ్ పట్ల సానుకూలంగా ఉన్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశిస్తే రాష్ట్రంలో నితీశ్ తో పొత్తుకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఆయన ప్రకటించారు. వారసత్వ రాజకీయాలను నితీశ్ బహిరంగంగా వ్యతిరేకించారని, అదీ శుభ పరిణామమని సుశీల్ మోదీ అంటున్నారు. బిహార్ వ్యవహారాలపై అమిత్ షా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
మారుతుండే రాజకీయ జీవితం…
వరుస ఓటముల తర్వాత నితీశ్ తొలి సారి 1985లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1998లో బీజేపీతో పొత్తు పెట్టుకుని వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 2000 సంవత్సరం తొలి సారి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2003లో సమతా పార్టీ జనతాదళ్ లో కలిసినప్పుడు నితీశ్ మళ్లీ సీఎం అయ్యారు. 2005లో జేడీయూ- బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు మళ్లీ సీఎంగా ఎన్నికయ్యారు. 2013లో నరేంద్ర మోదీ కేంద్రానికి రావడం ఇష్టం లేక బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో జేడీయూకు ఘోరమైన ఫలితాలు రావడంతో నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి రాజీనామా చేశారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. 2017లో మహాకూటమిని వదిలేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022లో బీజేపీని వదిలేసి మళ్లీ మహాకూటమిలో కలిశారు. ఇప్పుడు మహాకూటమికి స్వస్తి చెప్పి మళ్లీ బీజేపీతో కలిసే ప్రయత్నంలో ఉన్నారు…