రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈశాన్య రాష్ట్రాలను దాటుకుని తూర్పున ఉన్న పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది. అసోంలో రాహుల్ అనేక వివాదాలు సృష్టించడానికి ప్రయత్నించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నానన్న భ్రమతో తాను ఇరుకునపడిపోయారు. రూటూ మారి ఎటో వెళ్లాలని ప్రయత్నించి అసోం పోలీసుల ఆగ్రహానికి గురయ్యారు.
రాహుల్ కేసు స్పెషల్ సీఐడీకి బదిలీ
రాహుల్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల విధి నిర్వహణను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఖాకీలపై దాడులు కూడా చేశారు..దీనికి సంబంధించి రాహుల్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలపై కేసు నమోదైంది. కేసు విచారణ మొదలు కాకముందే రాహుల్ గాంధీ, అసోం పోలీసులపై ఆరోపణాస్త్రాలు సంధించారు. దీనితో కేసును ఇప్పుడు స్పెషల్ సీఐడీకి అప్పగించినట్లు అసోం డీజీపీ జీపీ సింగ్ ప్రకటించారు. రాహుల్ గాంధీకి సంబంధించిన కేసులను త్వరలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపడుతుందని జీపీ సింగ్ వెల్లడించారు. గువహాటీ రోడ్లపై ర్యాలీ చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ రాహుల్ వెంట వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అటుగా వెళ్లారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడులు జరిపారు. పైగా అలాంటి చర్యలకు దిగవద్దని సూచించిన అసోం సీఎం హిమంత బిశ్వా శర్మపై కూడా రాహుల్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు సంధించారు..
లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ అరెస్టు – హిమంత
అసోంలో శాంతి భద్రతలకు భంగం కలిగించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అక్కడి సీఎం హిమంత బిశ్వా శర్మ విశ్లేషించారు. అసోంలో రాహుల్ సందర్శించని ఆలయాలు చాలానే ఉన్నాయని, అయితే ఒక గుడికి మాత్రమే వెళ్లి ఆయన గొడవలు సృష్టించారని హిమంత ఆరోపించారు.లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ ను అరెస్టు చేస్తామని చెబుతూ….ఇప్పుడు అదుపులోకి తీసుకుంటే రాజకీయ కక్షతో చేశామని ప్రచారం చేసుకుంటారన్నారు. గువహాటీలో పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉండకపోతే భారీ విధ్వంసమూ, ప్రాణనష్టమూ జరిగి ఉండేదని హిమంత అన్నారు.
రాహుల్ అర్థం లేని మాటలు….
రాహుల్ ఎప్పుడేం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాని పరిస్థితులూ ఉంటాయి. అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ… స్టౌ మీద బొగ్గులు పెట్టి టీ కాచుకుంటారని రాహుల్ అన్నారు. దానికి బీజేపీ ఎదురుదాడి చేయగా రాహుల్ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్టౌ మీద ఎవరైనా బొగ్గులు పెడతారా.. కుంపటికి, స్టౌకు తేడా తెలియదా అని హిమంతా గట్టిగా అడిగే సరికి ఇప్పుడు కాంగ్రెస్ నేతలంతా మౌన రాగాలు ఆలాపిస్తున్నారు. రాహుల్ గాంధీకి బుర్ర పనిచేయడం లేదని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.