షర్మిల టార్గెట్ ఓట్ల చీలికే – కాంగ్రెస్‌కు లాభం ఏమిటి ?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలా రెడ్డి మొదటి టార్గెట్ ను డిసైడ్ చేసుకున్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా ముస్లిం, దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు షర్మిల మొదటి స్పీచ్ లోనే ప్రయత్నాలు చేశారు. టీడీపీ, వైసీపీ రెండూ బీజేపీకి దగ్గరని చెప్పడమే కాకుండా మణిపూర్ చర్చిలపై జరిగిన దాడుల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని ప్రత్యేకంగా టార్గెట్ చేశారు.

దళిత , ముస్లిం ఓటర్లను కాంగ్రెస్ వైపు రప్పించే వ్యూహం

కాంగ్రెస్ పార్టీని ఏపీలో ట్రాక్‌లోకి తెచ్చేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు. ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లను ఆకర్షించడం కోసమే ప్రయత్నిస్తున్నారు. సీఎం జగన్ సొంత పార్టీ పెట్టుకునే వరకూ ఏపీలో ముస్లిం, దళిత వర్గాలన్నీ కాంగ్రెస్ ను అంటి పెట్టుకుని ఉన్నాయి. తర్వాత పూర్తిగా వైసీపీ వైపు మళ్లాయి. ఇప్పుడు ఆ ఓటర్లను వెనక్కి రప్పించుకోవడం సులువు అన్న ఉద్దేశంతో షర్మిల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె ఈ రెండు వర్గాలకు కాంగ్రెస్ మాత్రమే రక్ష అన్నట్లుగా ప్రసగించారు. సీఎం జగన్ స్వయంగా క్రైస్తవుడు అయినప్పటికీ ఆయన మణిపూర్ లో చర్చిలపై జరిగిన దాడుల్ని ఖండించలేదని విమర్శించి సంచలనం రేపారు. ని

జగన్ కు భారీ నష్టం చేసే ప్లాన్

షర్మిల రాజకీయం ఇంత సూటిగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మొదట ఊహించలేదు. కానీ ఆమె బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎదురుదాడి చేయడంతో ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఆమె చంద్రబాబుకు మేలు చేస్తున్నారని అర్థం అవడంతో అప్రమత్తమయ్యారు. ఓట్లు చీల్చి చంద్రబాబుకు మేలు చేసేందుకే..షర్మిల రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే ఆమె విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. షర్మిల భర్త అనిల్ కుమార్ మత ప్రచారకుడు. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి కోసం చర్చిల పాస్టర్లను ప్రభావితం చేసేవారు. చర్చిల ద్వారా జగన్కు దళితుల్ని బలమైన ఓటు బ్యాంకుగా మార్చారన్న అబిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు ఆ ఓట్లు చీలిపోతే.. వైసీపీ నష్టపోతుంది.

వైసీపీ ఓడిపోతే షర్మిలకు వచ్చే లాభమేంటి ?

ఏపీలో కంగ్రెస్ కు ఉనికి లేదు.. రెండు, మూడు శాతం ఓట్లు చీలినా వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే.. షర్మిల టార్గెట్ చేస్తున్న ఓటు బ్యాంక్ పూర్తిగా వైసీపీదే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైనా షర్మిల వైపు మొగ్గినా ఆ ఓట్లు కూడా వైసీపీవే. అందుకే షర్మిలను వైసీపీ తేలికగా తీసుకునే అవకాశం లేదు. అయితే ఓట్ల చీల్చి వైసీపీని ఓడిస్తే షర్మిలకు వచ్చే లాభమేమిటన్నది రాజకీయవర్గాలకు అంతు చిక్కడం లేదు.