వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, మూడో దఫా అదే బాటలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరు ఆగమ్యగోచరంగా ఉంది.ఓటమి భయంతో వణికిపోతున్న ఆ పార్టీ తనకుతానుగా కొత్త సమస్యలు సృష్టించుకుంటోంది. దానికి తగ్గట్టుగా రాహుల్ గాంధీ తీరు సొంత పార్టీలోనే చాలా మందికి ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తోంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ వర్గాలు వాపోతున్నాయి..
బటాద్రవ సత్రా ఆలయ వివాదం..
రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్నారు. యాత్ర చేస్తూనే రోజుకో వివాదం సృష్టిస్తున్నారు. అసోంలోకి యాత్ర ఎంటరైన తర్వాత కావాలనే రూటు మార్చి శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. అనుమతి లేకున్నా బటాద్రవ సత్రా ఆలయానికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. 15వ శతాబ్ద అస్సామీ సంతు శ్రీమంత శంకరదేవ పుట్టిన గడ్డపై నిర్మించిన ఆలయం అది. అందులోకి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వలేదన్న కోపంతో రాహుల్ గాంధీ రచ్చరచ్చ చేశారు. కావాలనే గందరగోళ పరిస్థితి సృష్టించారు. ఆలయంలోకి గుంపుగా వెళ్లేందుకు ప్రయత్నించారు…
హిమంత విజ్ఞప్తి బేఖాతరు..
ముందుగా అసోం సీఎం హిమంత బిశ్వా శర్మ బహిరంగంగానే ఒక విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తం అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని తిలకించేందుకు సిద్ధమవుతున్న వేళ అనవసర రాద్ధాంతం వద్దని రాహుల్ గాంధీకి ఆయన విజ్ఞప్తి చేశారు. తాను అసోంలో ఓ ఆలయ ప్రవేశం చేసి రామాలయ అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో ఉండటం సరికాదని ఆయన గుర్తుచేశారు. దేశం మొత్తం ఒక దారి అయితే రాహుల్ మరో దారిలో వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీకి మాత్రమే ఆలయ ప్రదేశం ఉండాలా అని రాహుల్ ప్రశ్నించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అపహాస్యం చేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని అంటోంది. ఇది ముమ్మాటికి ఆమోదయోగ్యం కాదని తేల్చేసింది..
హిందూవాదులను రెచ్చగొట్టే ప్రయత్నం
దేశం మొత్తం ఇప్పుడు రామనామ జపం చేస్తోంది. అసోంలో కూడా ప్రజలంతా రామాలయ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. సరిగ్గా అప్పుడే రాహుల్ యాత్ర చేస్తున్నారు. రాహుల్ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎదురుగా వచ్చిన కొందరు హిందూ సంస్థల కార్యకర్తలు జై శ్రీరాం అని నినాదాలిచ్చారు. వారంతా రామాలయం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు వారికి ఎదురు నినాదాలిచ్చి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ కూడా వారికి చేయి చూపించారు. పైగా కిందకు దిగి వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితికి అవకాశం లేకుండా హిందూ కార్యకర్తలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. వారి మంచితనాన్ని రాహుల్ అర్థం చేసుకుంటే బావుంటుంది…