హిందువుల 500 ఏళ్ల కల నెరవేర్చిన బీజేపీ – చరిత్రలో సుస్థిర స్థానం

దేశంలో ఓ మహోన్నత ఘట్టం ఆవిష్కృతమయింది. దేశ ప్రజలంతా పాలుపంచుకున్నారు. ఈ రామమందిరం క్రెడిట్ ఖచ్చితంగా దక్కాల్సింది బీజేపీకే. చరిత్రలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ఎన్నో కష్టనష్టాలకు ఎదురేగి పోరాడి అనుకున్నది సాధించారు. హిందువుల కల నెరవేర్చారు.

అందరి వాడు శ్రీరాముడు

శ్రీరాముడు అందరి వాడు. ఆయన అందరికీ బంధువు. జగదేక వీరుడు ఆయనది జగమంత కుటుంబం…. రాముడి ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన చూపులకు పరిధులుండవు. సమస్త ప్రపంచం ఇప్పుడు రామనామం జపిస్తోంది… ఆయన కోసం తపిస్తోంది. అయోధ్య నుండి దర్శనం ఇవ్వనున్న బాల చంద్రుడి దర్శనం కొరకు ఆసేతు హిమాచలం అమితానందంతో ఎదురు చూస్తోంది. రామ మందిరానికై జరిగిన రాజీలేని పోరాటంలో ఎందరో భక్తులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. రామ జన్మభూమికై దేశ వ్యాప్తంగా ఆయా దశల్లో పెద్ద ఎత్తున జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొని నేటి విజయానికి బాటలు వేశారు.

రథయాత్రతో ఉద్యమం తీవ్ర తరం

రామాయణ మహాకావ్యం ఆవిష్కరణకు మూలం అయోధ్య. 1528లో మొఘల్‌లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు. ఫలితంగా రాముడు పుట్టిన ప్రాంతం వారి ఆధీనంలోకి వెళ్ళింది. అయోధ్య నగరంలో వున్న రామ మందిరాన్ని భూస్థాపితం చేసి దాని స్థానే మసీద్‌ను అక్రమంగా నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 1980 దశకంలో విశ్వహిందూ పరిషత్ రామజన్మ భూమికై ఆందోళనకు తీవ్రతరం చేశాయి. 1990వ సంవత్సరంలో ఆందోళన పతాక స్థాయికి చేరింది. ఆ ఏడాది సెప్టెంబర్,- అక్టోబర్ నెలల్లో సాగిన రథయాత్ర ఉద్యమాన్ని దేశ నలుదిశలూ మార్మోగేలా చేసింది. బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ రథయాత్ర కు నాయకత్వం వహించారు. మహోగ్రంగా సాగిన రథయాత్రకు అద్వానీ సారథి కాగా, సంఘ్ పరివార్ వారధిగా నిలిచింది.

బీజేపీకి రాజకీయ అధికారంతోనే సాధ్యం

రామ శిలా పూజల సమయంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో అద్వానీ రథయాత్ర నేపథ్యంలో ఊరూరూ రామ శిలా పూజలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క గ్రామం నుండి ఇటుకలను సేకరించి, వాటిన ఆయా గ్రామాల్లోని రామాలయాల్లో పూజించి, కరసేవలో భాగంగా అయోధ్యకు చేర్చి రామ మందిరం నిర్మాణానికి ఇవ్వాలనేది ఓ సంకల్పం. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ క్రతువు జరిగింది అందుకే పూర్తి క్రెడిట్ బీజేపీ , ఆరెస్సెస్, హిందూ బంధువులకు దక్కుతుంది.