చంద్రుడికో నూలు పోగు అంటారు. కొందరు ఉడుతా భక్తి అని అంటారు. ఐనా అందులో ఒక కార్యదక్షత, ఒక సత్సంకల్పం ఉంటుంది. రామాలయం విషయంలోనూ అదే జరిగింది. అయోధ్యలో ఆలయం కోసం శతాబ్దాలుగా ఎందరో కృషి చేశారు. బాబరు కూల్చిన చోటే ఆలయం కట్టాలని ప్రయత్నించారు. అందుకే మందర్ వహీం బనాయేంగే అన్న నినాదం ఇవ్వాల్టిది కాదని గుర్తించాలి…
165 ఏళ్ల క్రితం బాబా ఫకీర్ సింగ్
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అప్పుడు రామాలయ చరిత్రకు సంబంధించిన అనేక ఘట్టాలు ప్రస్తావనకు వచ్చాయి. వెయ్యి పేజీల సుప్రీం కోర్టు తీర్పులో నిహంగ్ సిక్కుల పాత్ర కూడా ప్రస్తావనకు వచ్చింది. 165 సంవత్సరాల క్రితం అంటే 1858 నవంబరు 28న అవథ్ లేదా అయోధ్య నగరానికి చెందిన రక్షణ విభాగాధిపతి (ఠానేదార్) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రస్తావన తీర్పులో ఉంది. సిక్కు గురువుల్లో ఒకరిగా భావించే బాబా ఫకీర్ సింగ్ ఖల్సా మసీదులోకి ప్రవేశించి సిక్కు పదో గురువు గోవింద్ సింగ్ కు అనుకూలంగా నినాదాలిచ్చారు.శ్రీ భగవాన్ అంటే శ్రీ రాముడి చిహాన్ని అక్కడ ఉంచారు.మసీదు గోడలపై రామ్ రామ్ అని రాశారు. బాబా అక్కడ కొన్ని క్రతువులు నిర్వహించే సమయంలో పాతిక మంది అనుచరులు, భక్తులు బయట నిల్చున్నారు. లోపలికి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. ఇదీ రికార్డెడ్ హిస్తరీ. ఇదీ పూర్తిగా చారిత్రక సాక్ష్యం
బాబా పెట్టిన బొమ్మ, వస్తువులు తొలగింపు…
బాబా ఫకీర్ సింగ్ మసీదులోనే ఉండిపోయారని అప్పటి మసీదు నిర్వాహకుడి ఫిర్యాదు మేరకు అవధ్ పాలకుడు సయ్యద్ మొహమ్మద్ ఖాతీబ్ .. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైగా ఒక దిమ్మెను కూడా కట్టారని అక్కడ రాముడి విగ్రహం పెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ముస్లింలపై హిందువులు పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ నమాజ్ కు అవరోధం ఏర్పడుతోందని కూడా ఆయన అన్నారు. తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి బాబాను అక్కడ నుంచి ఖాళీ చేయించడంతో పాటు రామ జన్మభూమిలో పెట్టిన వస్తువులన్నింటినీ తీసేసినట్లు అప్పటి రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలో నిహంగ్స్ (సిక్కు బైరాగీలు) నిర్మించిన ఫ్లాట్ ఫాం కూడా తొలగించారు..
ప్రాణప్రతిష్ట వేళ నిహంగుల అన్నదానం
ఆనాడు తమ మత పెద్ద చేసిన ప్రయత్నాలకు గుర్తుగా ఇవ్వాళ నిహంగ్ సిక్కులు అయోధ్య రామాలయ పరిసర ప్రాంతాల్లో లంగర్ (వంటగది) నిర్వహించి అన్నదానం చేశారు. నిజానికి 1510లో సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ అయోధ్య ఆలయాన్ని సందర్శించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇదీ భారతీయతకు నిదర్శనమని రాముడు అందరివాడని దేశ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. నిహంగ్ సిక్కుల్లో ఒకరైన బాబా హర్జిత్ సింగ్ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.