అయోధ్య రామయ్యను దర్శించుకునే వేళలు ఇవే – ఆన్ లైన్ బుకింగ్ ఇలా!

దాదాపు 500 ఏళ్ల హిందువుల కల సాకారమైంది. రామజన్మభూమిలో నూతనంగా నిర్మించిన మందిరంలో శ్రీరామచంద్రుడు కొలువు తీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా సోమవారం బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట క్రతువు ఘనంగా జరిగింది. మరి అందరూ దర్శించుకునేలా… బాలరాముడి దర్శన వేళలు ఎప్పుడంటే..

జగదానంద కారకుడి ప్రాణ ప్రతిష్ట కన్నుల పండువగా జరిగింది. రామ నామ స్మరణతో అయోధ్యతో పాటు దేశమంతా భక్తిభావంతో నిండిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహించారు. వేదమంత్రోఛ్చారణల మధ్య ఈ ఘట్టం పూర్తైంది. విగ్రహ ప్రతిష్టకు కర్తగా వ్యవహరించారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లతో పాటు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కూడా పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ట సమయంలో ఆలయం మీద నుంచి హెలికాఫ్టర్‌లతో పూల వర్షం కురిపించారు. ఈ ముహూర్తాన ఆలయ ప్రాంగణంతో పాటు అయోధ్య అంతా జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది.

సకలాభరణాలతో అలంకరించిన బాలరాముడి దివ్యరూపం చూసే భాగ్యంకోసం ఎదురుచూస్తున్నారు సామాన్య భక్తులు. జనవరి 23 మంగళవారం నుంచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

బాలరాముడి దర్శన వేళలు ఇవే
అయోధ్య రామ మందిర సామాన్యుల దర్శనం కోసం స్లాట్‌లు కేటాయించారు. జనవరి 23 మంగళవారం ఉదయం 7గం​. నుంచి 11.30 వరకు, అలాగే మధ్యాహ్నాం 2గం. నుంచి 7 వరకు భక్తులకు అనుమతిస్తారు.
దర్శనం, హారతి సమయాలు మేలుకొలుపు, శృంగార హారతి: ఉదయం 6.30 గంటలకు
భోగ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు
సంధ్యా హారతి : సాయంత్రం 7.30 గంటలకు

ఆన్‌లైన్‌లో దర్శనం పాస్‌ బుకింగ్‌
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవాలి. అనంతరం ఓటీపీ వస్తుంది
హారతి లేదా దర్శనం కోసం స్లాట్‌ను బుక్‌ చేసుకోవడానికి ‘మై ప్రొఫైల్‌’ పై క్లిక్‌ చేయాలి
దర్శనం లేదా హారతి కోసం కోరుకుంటున్న తేదీని ఎంపిక చేసుకోవాలి
భక్తుల వ్యక్తిగత వివరాలను సమర్పించాలి
హారతి సమయానికి ముందు రామాలయం ప్రాంగణంలోని కౌంటర్‌ వద్ద పాస్‌ తీసుకోవాలి.