అశోక్ గెహ్లాట్ అవినీతిపై ఈడీ నజర్

రాజస్థాన్లో మునుపటి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం చేయని అవినీతి లేదు. తినని ప్రభుత్వ సొమ్ము లేదు. ఎన్ని ఆరోపణలు వచ్చినా, రెడ్ డైరీలో పేర్లు ఉన్నా సరే అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజల సొమ్మును పందికొక్కుల్లా మెక్కేశారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటొకటిగా బయటపడుతున్నాయి…కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా నిరాకంటంగా పనిచేసుకుపోతున్నాయి..

మాజీ మంత్రి, అనుచరుల నివాసాల్లో సోదాలు

అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలో మహేష్ జోషి ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖామంత్రిగా పనిచేశారు. జలజీవన్ మిషన్ కార్యక్రమాల్లో అవినీతి జరిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దానిపై కేంద్రానికి కూడా ఫిర్యాదులు అందడంలో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పుడు మహేష్ జోషితో పాటు కొందరు అధికారుల నివాసాల్లో, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. టెండర్ల ప్రక్రియలో గోల్ మాల్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. నకిలీ సర్టిఫికెట్లతో టెండర్లు పొందినట్లు ఈడీ గుర్తించింది. ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్) పేరుతో టెండర్లు పొందారు. నిజానికి అలాంటి కంపెనీ రిజిష్టర్ కాలేదు. టెండర్ల కోసం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్టమెంట్ అధికారులకు భారీగా లంచాలు ముట్టజెప్పారు.

అవినీతి సొమ్ముతో ఆస్తులు కొనుగోలు..

కాంగ్రెస్ పాలనాకాలంలో పోగైన అవినీతి సొమ్ముతో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు కూడా ఈడీ అధికారులు నిర్థారణకు వచ్చారు. ఈ క్రమంలో జైపూర్, బన్స్వారా సహా ఎనిమిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. లెక్కతేలని 40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అవినీతికి సంబంధించి మొత్తం డేటా ల్యాప్ టాపులు, స్మార్ట్ ఫోన్లలో ఉందని వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు.

వైభవ్ గెహ్లాట్ కార్యాలయాల్లో సోదాలు

ఫారెక్స్ ఉల్లంఘన కేసులో అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ ఆస్తులపై ఈడీ నేడు సోదాలు నిర్వహిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన హాస్పిటాలిటీ గ్రూప్ ట్రిటాన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌, వర్ధ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం శివ శంకర్ శర్మ, రతన్ కాంత్ శర్మలపై నమోదైన కేసు విచారణలో భాగంగా వైభవ్‌పై కూడా ఈడీ చర్య తీసుకుంది. రతన్ కాంత్ శర్మ కార్ రెంటల్ సర్వీస్‌లో వైభవ్ వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. మారిషస్‌కు చెందిన శివ్నార్ హోల్డింగ్స్ అనే షెల్ కంపెనీ నుంచి అక్రమ నిధులను ముంబయికి చెందిన ట్రిటాన్ హోటల్స్‌కు మళ్లించారని రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. హోటల్‌కు చెందిన 2,500 షేర్లను కొనుగోలు చేసి నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఒక్కో షేరు అసలు ధర రూ. 100 ఉండగా, రూ.39,900కు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్‌లో ఈడీ ముందు వైభవ్ హాజరయ్యారు. జైపూర్, ఉదయ్‌పూర్, ముంబయి, ఢిల్లీలోని ప్రదేశాలలో గతేడాది ఆగస్టులో మూడు రోజుల పాటు ట్రైటన్ హోటల్స్ దాని ప్రమోటర్లపై ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాల తర్వాత లెక్కల్లో చూపని రూ.1.2 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ వైభవ్ కార్యాలయాల్లో వరుస సోదాలు జరుగుతున్నాయి….