450కి పైగా స్థానాల్లో బీజేపీ పోటీ…

లోక్ సభ ఎన్నికల బరిలో బీజేపీ వ్యూహంపై క్రమంగా క్లారిటీ వచ్చేస్తోంది. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి,పొత్తు భాగస్వాములకు ఎన్ని సీట్లు ఇవ్వాలి లాంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి బరిలో ఉండే మొత్తం స్థానాలపై స్పష్టత తెచ్చుకుంటున్నారు. తదుపరి దశలో నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి..

జేడీయూ, అన్నాడీఎంకే లేకపోవడంతో….

2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 436 స్థానాల్లో పోటీ చేసింది.303 చోట్ల గెలిచింది. ఈ సారి 450 స్థానాలకు పైగా పోటీ చేయాలని లెక్కలేసుకుంటోంది. అందుకు కారణాలు లేకపోలేదు. తమ గొంతెమ్మ కోరికలు తీర్చలేదన్న కోపంతో కొందరు పొత్తు భాగస్వాములు వైదొలిగారు. దానితో బీజేపీకి ఎక్కువ చోట్ల పోటీ చేసే అవకాశం వస్తోంది. బిహార్ రాష్ట్రంలో జేడీయూ, మహారాష్ట్రలో శివసేన, తమిళనాడులో అన్నాడీఎంకే, పంజాబ్ లో అకాళీదళ్ ఇప్పుడు బీజేపీ మిత్రపక్షాలు కాదన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2019 బిహార్లో బీజేపీ కేవలం 17 చోట్ల పోటీ చేసింది. అక్కడ 40 లోక్ సభా స్తానాలున్నాయి. మహారాష్ట్రలోని 48 స్తానాల్లో బీజేపీ 25 చోట్ల మాత్రమే బరిలోకి దిగింది. తమిళనాడులో ఐదు చోట్ల, పంజాబ్లో మూడు చోట్ల మాత్రమే పోటీ చేయగలిగింది.

యువకులు,మహిళల ఓట్లే టార్గెట్

ఈ సారి ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత, మహిళలు తమ వైపే ఉంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తొలి సారి ఓటర్లే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పేదలకు అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ దాని వల్ల యువతకు ప్రయోజనం కలుగుతుందని, ఆ అంశాన్నే పార్టీ శ్రేణులు ప్రచారం చేయాలని అమిత్ షా ఆదేశించారు.ఓసీబీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమకు శ్రీరామరక్షగా నిలుస్తాయని, వాటి వల్ల యువకులు, మహిళలు విస్తృత ప్రయోజనం పొందారని బీజేపీ వాదిస్తోంది.

మోదీ పేరుతోనే ప్రచారం

450 స్థానాలకు పైగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కరిష్మాతోనే ప్రచార కార్యక్రమం నిర్వహించాలని బీజేపీ డిసైడైంది. ఆర్టికల్ 370 రద్దు, రామాలయ నిర్మాణం ప్రత్యేక ప్రచారాస్త్రాలు అవుతాయని బీజేపీ విశ్వసిస్తోంది. ఈ రెండు అంశాల్లో మోదీ చూపిన ప్రత్యేక చొరవ దేశం ప్రజల నమ్మకాన్ని పెంచిందని అమిత్ షా అంటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదం జనంలోకి బాగా వెళ్లిందని కూడా బీజేపీ అంటోంది. అది కేవలం మోదీ గొప్పదనమేనని ప్రశంసిస్తోంది. పైగా ఇప్పుడు దక్షిణాదిలో కూడా బీజేపీ వేగంగా విస్తరిస్తోంది…