టీడీపీ , జనసేన మధ్య పిఠాపురం ముడి – టిక్కెట్ ఎవరికి ?

టీడీపీ , జనసేన మధ్య సీట్ల పీటముడి పడే నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. అధికార వైసిపి అభ్యర్థి విషయంలో స్పష్టత ఇచ్చింది. ఇక ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచినా..నియోజకవర్గాల కేటాయింపుల్లో నేటికీ ఒక స్పష్టత రావడం లేదు. దీంతో తమ నియోజకవర్గానికి అభ్యర్థి ఎవరనే అయో మయంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

పిఠాపురం తమకే కావాలంటున్న జనసేన

వైసీపీ అభ్యర్థిపై స్పష్టత వచ్చినప్పటికీ ప్రధాన ప్రతిపక్షం టిడిపి, జనసేన పార్టీల మధ్య మాత్రం ఇంకా లెక్క తేలలేదు. పొత్తు ఖరారైన తర్వాత ఎవరికి వారు తామే పోటీ చేస్తామంటున్నారు. ఇక్కడ టిడిపి నుంచి ఎస్‌విఎస్‌ఎస్‌.వర్మ, జనసేన పార్టీ నుంచి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాలను ఆశిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి 2014లో టిడిపి నుంచి వర్మతోపాటు, కైట్‌ విద్యా సంస్థల అధినేత పోతుల విశ్వం పోటీ పడ్డారు. ఆఖరికి టిడిపి అధిష్టానం విశ్వంకే టిక్కెట్టును కేటాయించింది. దీంతో వర్మ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి సుమారు 50 వేల ఓట్ల ఆధిక్యంతో టిడిపి, వైసిపి అభ్యర్థులను ఓడించారు. వెంటనే ఆయన తిరిగి టిడిపిలో చేరారు.

టీడీపీనే అంటి పెట్టుకుని ఉన్న వర్మ

గత ఐదేళ్లుగా అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తున్నారు 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాలని వ్యూహాలను రచించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టిడిపి, జనసేన పార్టీల మధ్య పొత్తు అనివార్యం అయ్యింది. దీంతో ఈ టిక్కెట్టును పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయిస్తారనే ప్రచారం పెద్దఎత్తున సాగుతోంది. ప్రస్తుతం జనసేన పార్టీ నుంచి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌్‌గా ఉన్న తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌ స్థానికేతరుడు కావడంతో టిడిపి అధిష్టానం ఈ టిక్కెట్టును టిడిపికే ఉండేలా చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.

జనసేనకు ఆర్థిక సాయం చేస్తున్న ఉదయ శ్రీనివాస్

ఉదయశ్రీనివాస్ జనసేనకు ఆర్థికంగా అండగా ఉంటున్నారు. ఈ కారణంగా ఆయన కోసం పిఠాపురం తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడుతోంది. మరో వైపు ఇదే నియోజక వర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీకి దిగుతారనే ప్రచారం లేకపోలేదు. అదేజరిగితే టిడిపి అధిష్టానానికి చేసేది ఏమీ ఉండదు. వర్మకు టిక్కెట్టు లభించే అవకాశాలు ఉండవు. దీంతో ఆయ న పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? లేక గతంలో మాదిరిగా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలో నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.