టీడీపీ, జనసేన మధ్య తెనాలి చిచ్చు – అసలేం జరుగుతోంది ?

తెనాలిలో జనసేన, టిడిపి మధ్య పొత్తు ఫలించేలా లేదు. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టిడిపి, జనసేన పొత్తుకు రాష్ట్రవ్యాప్తంగా సిద్ధమైనా తెనాలిలో చిక్కులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. తెనాలిలో జనసేన అభ్యర్థిగా మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ను ఎంపిక చేస్తున్నట్టు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దాదాపు ఆరు నెలల క్రితమే ప్రకటించారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి టిడిపి ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ కూడా తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేశారు.

ఇండిపెండెంట్‌గా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ

టిడిపి టిక్కెట్‌ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. టిడిపి నుంచి ఇప్పటి వరకు సీట్ల కేటాయింపుపై ఎలాంటి ప్రకటన రాకపోయినా నాదెండ్ల మనోహర్‌ ఇప్పటికే జనసేన అభ్యర్థిగా ప్రచారంలో ఉండటం, ఆలపాటికి ప్రత్యామ్నాయం గురించి టిడిపి అధిష్టానం నుంచి స్పష్టత రాలేదు. దీంతో ఆలపాటి గ్రూపు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని పనిచేస్తూ ప్రతిపక్షంలో చురుకైనపాత్ర పోషిస్తున్నా ప్రాతినిధ్యం కల్పించకపోతే ఎలాగని టిడిపి శ్రేణులు అంటున్నాయి.

టిక్కెట్ లేకపోతే వేరే దారి చూసుకునే ఆలోచన

ఈ క్రమంలో గుంటూరు విద్యా నగర్‌లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మంగళవారం తన అనుచరులు, నియోజకవర్గం ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తెనాలి సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారంతో తాము రాజీనామాలు చేస్తామంటూ ఆలపాటికి ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పారు. అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని వారికి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సర్ది చెప్పారు. తనకు టిక్కెట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని చెప్పారు. బుధవారం తెనాలిలో టిడిపి కార్యకర్తలతో రాజేంద్రప్రసాద్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటున్న ఇరు పార్టీలు

టిడిపి నిర్వహించిన సర్వేలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు గెలుపు అవకాశాలున్నాయని నివేదికలొచ్చినట్లు చెబుతున్నారు. అయితే జనసేన పార్టీలో పవన్‌ కల్యాణ్‌ తరువాత అన్ని తానై చూస్తూ నంబరు-2గా పేరొందిన నాదెండ్ల మనోహర్‌కే ఆదిలోనే సమస్యలు ప్రారంభం అయ్యాయి. టిడిపి, జనసేన పొత్తుపై ఎన్నికలకు ముందుగానే అంతర్గత కలహాలు పెరుగుతుండటంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా చోటుచేసుకుంటాయోనే ఉత్కంఠ నెలకొంది.